మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్

by Dishanational2 |
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి: మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే డిమాండ్ చేశారు. శనివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. కాబట్టి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. షిండే హయాంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం నిందితులను కాపాడుతోందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం షిండేకు లేదన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేపట్టాలన్నారు. అలాగే మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితిపై అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని కోరుతూ శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఒకప్పుడు వర్తక, వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన ముంబై నగరం ఇప్పుడు నేరాలు, హింసతో అట్టుడుకుతుందని పేర్కొన్నారు. అంతేగాక రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సైతం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఇటీవల దహిసర్‌లో శివసేన(యూబీటీ)కి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్‌ను కాల్చి చంపారు. అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే గణపత్ గైక్వాడ్‌ ఓ భూ వివాదం విషయంలో స్థానిక శివసేన నాయకుడిపై కాల్పులు జరిపారు.

Next Story