Prayagraj: ప్రయాగ్‌రాజ్ వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్

by S Gopi |

ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా, రద్దీని నివారించడానికి స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

Prayagraj: ప్రయాగ్‌రాజ్ వెళ్లే దారిలో భారీ ట్రాఫిక్ జామ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సందర్భంగా జనం విపరీతంగా పెరగడంతో సంగం స్టేషన్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. యాత్రికులు పెద్దఎత్తున తరలిరావడంతో ప్రయాణికుల భద్రతకు, ప్రయాణికుల రాకపోకల నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా, రద్దీని నివారించడానికి స్టేషన్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 'స్థానికంగా కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా చూడటం, మరింత సమర్థవంతమైన క్రౌడ్ కంట్రోల్ మెకానిజమ్‌లను సిద్ధం చేయడానికి సమయం కోసం ప్రయాగ్‌రాజ్ సంగం స్టేషన్‌ను మూసివేసినట్టు' అధికారులు తెలిపారు. యాత్రికులు సురక్షితంగా వెళ్లేందుకు అదనపు ఏర్పాట్లలో భాగంగా సమీపంలోని ఇతర స్టేషన్‌లకు రైళ్లను మళ్లించినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు మధ్యప్రదేశ్‌లో భారీ ట్రాఫిక్, రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాకు వెళ్లే వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు రేవా రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సాకేత్ ప్రకాష్ పాండే అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలు ఒకటి, రెండు కిలోమీటర్లు వెళ్లేందుకు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతోందని సమాచారం. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ఎన్‌హెచ్30 మహారాష్ట్ర, తమిళనాడు, అస్సాం, ఇతర రాష్ట్రాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే యాత్రికులకు ప్రధాన మార్గం కావడం కూడా ట్రాఫిక్ జామ్‌కు కారణమైంది. దీంతో వేలాది వాహనాలతో హైవే కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రి సమయానికి 10,000 వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నట్టు సమాచారం. రద్దీని తగ్గించేందుకు విడతల వారీగా వాహనాలను పంపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పరిస్థితి మెరుగుపడిన తర్వాత మాత్రమే వాహనాలు వెళ్లేందుకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు భక్తులు ఓపికగా ఉండాలని, అనవసరమైన ఇబ్బందులను నివారించడానికి అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు.

Next Story