- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pope francis: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పూర్తి.. 50 మందికిపైగా దేశాధినేతల హాజరు
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు ముగిశాయి. రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాలో పోప్ మృత దేహాన్ని ఖననం చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: క్రైస్తవ కాథలిక్ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ (Pope francis) అంత్యక్రియలు ముగిశాయి. రోమ్‌లోని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాలో పోప్ మృత దేహాన్ని శనివారం ఖననం చేసినట్టు వాటికన్ (Vatican) వర్గాలు వెల్లడించాయి. ఖననం చేయడానికి ముందు ప్రార్థనా కార్యక్రమం చేపట్టారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మధ్యాహ్నం 1:30 గంటలకు అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో కార్డినల్స్, ఆర్చ్‌బిషప్‌లు, బిషప్‌లు, మత గురువులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనంలో పోప్ భౌతిక దేహాన్ని శాంటా మారియా మాగ్గియోర్ బసిలికాకు తరలించారు. పోప్‌ను సమాధి చేసిన చర్చిలో ఆయనకు అత్యంత ఇష్టమైన వర్జిన్ మేరీ చిహ్నం ఉంది. అంత్యక్రియలకు 2,50,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారని, పాపల్ ఊరేగింపు సందర్భంగా రోమ్ వీధుల్లో పదివేల మంది బారులు తీరారని వాటికన్ అధికారులు తెలిపారు.
ట్రంప్, ముర్ము సహా దేశాధినేతల హాజరు
పోప్ ఫ్రాన్సిస్‌కు తుది వీడ్కోలు పలికేందుకు పలువురు దేశాధినేతలు భారీగా తరలివచ్చారు. భారత్ తరఫున రాష్ట్రపతి ముర్ము హాజరయ్యారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump), అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిల్లీ, బ్రిటన్ పీఎం కీర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ, జర్మన్ అధ్యక్షుడు ఫ్రాంక్-వాల్టర్ స్టెయిన్‌మీర్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, సహా 50 మందికి పైగా దేశాధినేతలు అటెండయ్యారు.
జెలెన్ స్కీ, ట్రంప్ భేటీ
పోప్ అంత్యక్రియలకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీలు భేటీ అయ్యారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై చర్చించినట్టు ఇరు దేశాల అధ్యక్ష కార్యాలయాలు ధ్రువీకరించాయి. ‘ట్రంప్‌తో మంచి సమావేశం జరిగింది. అనేక విషయాలపై ఏకాంతంగా చర్చించాం. డిస్కస్ చేసిన అంశాలు మంచి ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నాం. మా ప్రజల ప్రాణాలను కాపాడటం పూర్తి కాల్పుల విరమణను అమలు చేయడం మా లక్ష్యం. మంచి ఫలితాలు సాధిస్తే ఈ సమావేశం చారిత్రాత్మకం అవుతుంది. ట్రంప్ కు ధన్యవాదాలు’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. ట్రంప్, జెలెన్ స్కీ మధ్య ఇటీవల జరిగిన వాగ్వాదం తర్వాత ఇరువురి మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.






