దీపావళి, ఛత్ పూజ తర్వాతే బిహార్ ఎన్నికలు.. ఈసీని కోరిన రాజకీయ పార్టీలు

by Phanindra |

దీపావళి, ఛత్ పూజ తర్వాతే బిహార్ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని రాజకీయ పార్టీలు కోరాయి. అలాగే ఒకే ఫేజ్‌లో ఎన్నికలు ముగించేందుకు ప్రయత్నించాలని చెప్పాయి.

దీపావళి, ఛత్ పూజ తర్వాతే బిహార్ ఎన్నికలు.. ఈసీని కోరిన రాజకీయ పార్టీలు
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికలను ఛత్ పూజ అనంతరం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని పలు రాజకీయ పార్టీలు కోరాయి. ఈ అంశాన్ని చర్చించేందుకు అన్ని పార్టీలతో ఎన్నికల సంఘం తాజాగా సమావేశమైంది. ఈ మీటింగ్‌లో ఆప్, బీఎస్పీ, బీజేపీ, సీపీఐ(ఎం), కాంగ్రెస్, జేడీయూ, ఎల్జేపీ (రామ్ విలాస్), ఆర్జేడీ సహా పలు రాష్ట్రీయ, జాతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛత్ పూజ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని, అలాగే సాధ్యమైనన్ని తక్కువ దశల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయా పార్టీల ప్రతినిధులు సూచించారు. ఎన్నికలను ఒకే దశలో పూర్తిచేయాలని తాము కోరినట్లు జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ కుమార్ ఝా వెల్లడించారు.

అలాగే ఉద్యోగాల కోసం వలస వెళ్లిన ప్రజలు కూడా దీపావళి, ఛత్ పూజ వంటి పండుగల కోసం తిరిగి వస్తారు కాబట్టి.. ఆ పండుగలు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కువ మంది ఓటర్లు ఎన్నికల్లో పాల్గొంటారని సూచించినట్లు తెలిపారు. పోలింగ్ బూత్‌ల వద్ద కట్టుదిట్టమైన రక్షణ ఉండేలా చూసుకోవాలని కూడా చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నవంబరు 5 నుంచి 15 మధ్య రెండు దశల్లో బిహార్ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2020లో బిహార్ ఎన్నికలు మూడే దశల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా తప్పుడు వార్తలు పోస్ట్ అయితే వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించింది.

Next Story