Maoist capital : మావోయిస్టుల రాజధానిలో పోలీస్ బేస్ క్యాంప్ !

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-08 06:23:21  IST  )

దేశంలో 2026మార్చి లోపు మావోయిస్టుల సంపూర్ణ ఏరివేత(Maoists)లక్ష్యంగా చత్తీస్ గఢ్ లో కేంద్ర, రాష్ట్ర బలగాలు(Security Forces) నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్(Operation Kagar)లో కీలక ముందడుగు పడింది.

Maoist capital : మావోయిస్టుల రాజధానిలో పోలీస్ బేస్ క్యాంప్ !
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో 2026మార్చి లోపు మావోయిస్టుల సంపూర్ణ ఏరివేత(Maoists)లక్ష్యంగా చత్తీస్ గఢ్ లో కేంద్ర, రాష్ట్ర బలగాలు(Security Forces) నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్(Operation Kagar)లో కీలక ముందడుగు పడింది. ఛత్తీస్ గడ్ దండకారణ్యంలో మావోయిస్టుల నిర్మూలన దిశగా వరుస ఎన్ కౌంటర్లు, కూంబింగ్ ఆపరేషన్లు, స్పెషల్ ఆపరేషన్లతో ముందుకెలుతున్న భద్రతా బలగాలు అబూజ్ మాడ్ అడవుల్లో వరుసగా బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తు మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్నాయి. మావోయిస్టుల కంచు కోటలో వరుస బేస్ క్యాంప్ ల ఏర్పాటు తో మరింత పట్టు సాధించిన భద్రతా బలగాలు తాజాగా నారాయణపూర్ జిల్లా అబూజ్ మాడ్ అటవీ ప్రాంతంలో మరో పోలీస్ బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ ధఫా ఏకంగా ఆబూజ్ మాడ్ అటవీ ప్రాంతానికి మావోయిస్టుల రాజధాని(Maoist capital)గా భావించే కుతుల్(Kuthul) గ్రామంలో పోలీస్ బేస్ క్యాంప్(Police Base Camp) ఏర్పాటు చేయడం ఆసక్తి రేపింది.

ఏ అడవుల్లో మావోయిస్టులు బలంగా ఉన్నారో..వారికి సేఫ్ జోన్ గా ఉన్నాయో.. అదే అబూజ్ మాడ్ దండకారణ్యం అడవుల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు మావోయిస్టుల చుట్టు పద్మవ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్ఫీఎఫ్, కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్, తెలంగాణ గ్రేహౌండ్స్ సహా అన్ని బలగాలు జాయింట్ ఆపరేషన్స్ తో అత్యాధునిక సాంకేతికత వినియోగంతో అడవులను జల్లెడపడుతున్నాయి. 'ఆపరేషన్ కగార్'లో భాగంగా ప్రతి 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంపు ఏర్పాటు చేసి దండకారణ్యంలో సాయుధ భద్రతా బలగాలు చొచ్చుకెలుతున్నాయి. అటు పోలీసులు, ఇటు మావోయిస్టుల బూట్ల చప్పుళ్లు, తుపాకుల మోతతో కొద్ది నెలలుగా దండకారణ్యం దద్దరిల్లుతున్నది.

చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని ఏడు జిల్లాలని కలుపుతూ చుట్టూ సెలయేర్లు పెద్దపెద్ద గుట్టలు దట్టమైన కీకరారణ్యంతో ఉండే అబూజ్ మాడ్ అటవీ ప్రాంతం మావోయిస్టులకి పెట్టని కోట వంటిది. సుక్మా, దంతేవాడ, నారాయణపూర్, కాంకేర్, బస్తర్ జిల్లాల ప్రాంతాల్లో అబుజ్ మడ్ కొంత భాగం ఉంటే..మరి కొంత భాగం దండకారణ్యంలో ఉంది. ఒరిస్సా, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల్లోని దండకారణ్యంలో ఉన్న మావోయిస్టులకు ఈ అటవీ ప్రాంతాలు కీలక స్థావరాలు. దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు నాయకత్వం అంతా కూడా ఇక్కడే ఉంటుంది.

ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లోని పాతతరం మావోయిస్టు నాయకత్వం కూడా ఇదే ప్రాంతంలోని ఉంది. ఇక్కడ నుంచే దేశవ్యాప్త కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు చెందిన 90మంది మావోయిస్టు నాయకులు, సభ్యులు అక్కడే ఉన్నట్లుగా పోలీస్ వర్గాలు లెక్కలు కట్టాయి. ప్రస్తుతానికి వారంతా సురక్షిత ప్రాంతాల్లో ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలోని 13మంది సభ్యుల్లో 11మంది తెలుగువారే కావడం విశేషం.

మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్ మాడ్ అడవుల్లో వరుస ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు పెద్ద ఎత్తున మృతిచెందుతుండగా.. ఏడాదిన్నర వ్యవధిలోనే 287మంది వరకు వివిధ ఎన్ కౌంటర్లలో మృతి చెందారు. మరో 800 మంది లొంగిపోగా, మరెందరినో అరెస్టు చేశారు. ఏడాది వ్యవధిలోనే మావోయిస్టుల సంఖ్య వేయికి పడిపోయింది. వరుస పోలీస్ ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినప్పటికీ.. అదును దొరికినప్పుడల్లా పోలీసులపై మావోయిస్టులు గెరిల్లా దాడులతో ప్రతిఘటన పోరాటాలు కొనసాగిస్తున్నారు.

ఇదే క్రమంలో చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాల ముమ్మర ఆపరేషన్లతో దెబ్బతింటున్న మావోయిస్టులు తెలంగాణలోకి ఎంటర్ కాకుండా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి మావోయిస్టులను అడవి దాటకుండా చేస్తున్నారు. చత్తీస్ గఢ్ లోని బీజాపూర్, సుక్మా, బస్తర్ ఎజన్సీ, కాంకేర్ జిల్లాల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల 26మంది మావోయిస్టులు చత్తీస్ గఢ్ లో పెరిగిన భద్రతా బలగాల నిర్భంధంతో షెల్టర్ కోసం ఆంధ్రప్రదేశ్ లోకి ఎంటరైనట్లుగా ఏపీ పోలీస్ శాఖ వెల్లడించింది. దీంతో చత్తీస్ గఢ్ సరిహద్ధు జిల్లాల నుంచి పొరుగు రాష్ట్రాలలోకి మావోయిస్టులు వలస వెళ్లకుండా పోలీస్ బలగాలు సరిహద్ధుల్లో నిఘా ఆపరేషన్లు సాగిస్తున్నాయి.

Next Story