- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మైనర్లను వ్యభిచారంలోకి దింపితే ‘పోక్సో’ వర్తిస్తుంది: సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పు
లైంగిక దోపిడీ కోసం మైనర్లను అక్రమంగా రవాణా చేస్తే.. నేరుగా 'పోక్సో' చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చని సుప్రీంకోర్టు సెన్సేషనల్ తీర్పును వెలువరించింది.

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికల అక్రమ రవాణా నిరోధానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కమర్షియల్ సెక్స్ కోసం మైనర్లను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తే వారిపై నేరుగా పోక్సో (POCSO - Protection of Children from Sexual Offences) చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ బాలికలను కేవలం ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించడం అనేది ఐపీసీ (IPC), అనైతిక రవాణా నిరోధక చట్టం (ITPA) కిందకు వస్తుందని, లైంగిక దాడి జరిగేంత వరకు పోక్సో చట్టం వర్తించదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన పాత తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది.
సీజేఐ ధర్మాసనం షాకింగ్ కామెంట్స్..
అయితే, ఈ కేసును విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం చట్టంలోని అసలు ఉద్దేశాన్ని వివరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ బాలికలను అక్రమంగా తరలించడం వెనుక ఉన్న ఉద్దేశం కమర్షియల్ లైంగిక దోపిడీ అని ప్రాథమికంగా ఆధారాలు ఉన్నప్పుడు, అక్కడ పోక్సో చట్టంలోని సెక్షన్లను చేర్చడం చట్టబద్ధమే అవుతుందని తెలిపింది. మైనర్ల రక్షణ కోసం రూపొందించిన పోక్సో చట్టాన్ని కేవలం భౌతిక లైంగిక దాడి జరిగితేనే ఉపయోగించాలనే నిబంధన ఏమీ లేదని, లైంగిక దోపిడీ కోసం పిల్లలను రవాణా చేయడం కూడా ఆ చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది. లైంగిక నేరాల నుంచి మైనర్లను రక్షించేందుకు ఉద్దేశించిన పోక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. మైనర్ల అక్రమ రవాణా దారుణమైన నేరమని, ముఖ్యంగా వారిని లైంగిక వృత్తిలోకి నెట్టడానికి చేసే ప్రయత్నాలను ప్రాథమిక దశలోనే ఈ కఠిన చట్టం ద్వారా అడ్డుకోవచ్చని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది.






