- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రిక్స్‌ను కొత్త మార్గంలో నడిపిస్తాం..కొత్త రూపం అందిస్తాం: మోడీ
బ్రిక్స్‌ను కొత్త మార్గంలో నడిపిస్తామని, తమ ప్రెసిడెన్సీలో గ్రూప్‌కు కొత్త రూపం అందిస్తామని ప్రధాని మోడీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఏడాది బ్రిక్స్‌కు కొత్త రూపం ఇచ్చేందుకు భారత్ ప్రయత్నిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ సదస్సు చివరి రోజున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2026లో భారత్‌లోనే బ్రిక్స్ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ నుంచి బ్రిక్స్ నాయకత్వాన్ని భారత్ అందుకోనుంది. ఈ క్రమంలోనే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘బ్రిక్స్‌ను మా ప్రెసిడెన్సీలో కొత్త మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాం. బ్రిక్స్ అంటే బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టయినబిలిటీ అని అర్థం వచ్చేలా చేస్తాం. మా జీ20 చైర్మన్‌షిప్‌లో గ్లోబల్ సౌత్ సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే.. బ్రిక్స్‌ను కూడా మానవీయ కోణంలో ముందుకు తీసుకెళ్తాం’ అని చెప్పారు.
పర్యావరణం, సీవోపీ, గ్లోబల్ హెల్త్‌పై జరిగిన సెషన్‌లో మాట్లాడిన మోడీ.. కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీని ప్రస్తావించారు. అలాగే ప్రపంచానికి హాని చేసే శత్రువులను ఓడించడానికి అందరూ చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ‘వైరసులకు వీసాలు అక్కర్లేదని కొవిడ్ ప్యాండెమిక్ నిరూపించింది. అలాగే ఇలాంటి సమస్యలకు సమాధానాలు కూడా వ్యక్తుల పాస్‌పోర్టులు చూసి ఎంపిక చేసుకోకూడదు. అందరూ ఎదుర్కొనే సవాళ్లను కలిసి ఎదుర్కొంటేనే విజయం సాధిస్తాం’ అని చెప్పారు.
అంతకుముందు టెక్నాలజీకి సంబంధించిన సెషన్‌లో ఏఐపై భారత వైఖరిని కూడా ఆయన స్పష్టంచేశారు. ‘భారత్‌లో మానవ విలువలు, సామర్ధ్యాలను మరింత పెంచడానికి ఉపయోగపడే సాధనంగా ఏఐని చూస్తు్న్నాం. అందరికీ ఏఐ అందుబాటులో ఉండాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఏఐపై గవర్నెన్స్ ఉండటం, ఆందోళనలపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇన్నొవేషన్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని మేం నమ్ముతున్నాం’ అని వెల్లడించారు.
ఈ క్రమంలోనే పలు దేశాలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు చేపట్టారు. క్యూబా అధ్యక్షుడు మిగుల్ డియాజ్ కానెల్ బెర్మూడెజ్, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, ఉరుగ్వే ప్రెసిడెంట్ యామండూ ఒర్సి, బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆల్బర్టో ఆర్సె కాటకోరాలతో మోడీ విడివిడిగా భేటీ అయ్యారు. వాణిజ్య బంధాలు, డిజిటల్ టెక్నాలజీ, క్రిటికల్ మినరల్స్, ఆరోగ్యం, అంతరిక్షం తదితర రంగాల్లో సహకారం గురించి ఈ దేశాలతో చర్చలు జరిపినట్లు మోడీ తెలిపారు. 17వ బ్రిక్స్ సదస్సు ముగిసిన తర్వాత రెండ్రోజుల పాటు బ్రెజిల్‌లో మోడీ పర్యటించనున్నారు. మంగళవారం నాడు అల్వొరాడో ప్యాలెస్‌ను సందర్శించనున్నారు. అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాషియో లూలా డా సిల్వతో డిలిగేషన్ స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఈ చర్చల అనంతరం ఒప్పందాలపై ఇరుదేశాల నేతలు సంతకాలు చేస్తారని తెలుస్తోంది.






