పొరపాట్లను సరిదిద్దుతున్నాం.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు..

by Web Desk |
పొరపాట్లను సరిదిద్దుతున్నాం.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు..
X

న్యూఢిల్లీ: స్వాతంత్య్రం తర్వాత జరిగిన తప్పులను సరిదిద్దుతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని ఇండియన్ గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ డిజిటల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 'స్వతంత్ర భారత్ కల పట్ల విశ్వాసాన్ని నేతాజీ ఎప్పుడు కోల్పోలేదు. భారత్‌ను వణికించే ఏ శక్తి ప్రపంచంలో లేదు' అని మోడీ నొక్కి చెప్పారు. 'స్వాతంత్య్రం తర్వాత దేశ సంస్కృతి, వారసత్వంతో పాటు అనేకమంది మహానుభావుల సహకారాన్ని తుడిచి పెట్టే ప్రయత్నం జరగడం దురదృష్టకరం.

స్వాతంత్య్రం లక్షల మంది త్యాగాల ఫలితం. అయితే చరిత్రను కొందరికే పరిమితం చేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ, నేడు స్వాతంత్య్రం వచ్చిన దశాబ్దాల తర్వాత దేశం తప్పులను సవరించే పనిలో నిమగ్నమయ్యాం' అని అన్నారు. నేతాజీ 'చేస్తాం-తప్పక చేస్తాం' అనే నినాదంతో బ్రిటీష్ వారికి ఎదురు నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా గతేడాది కోల్‌కతా‌లోని నేతాజీ ఇంటిని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే గ్రానైట్‌తో నేతాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

'అంతకుముందు విపత్తు నిర్వహణ శాఖను వ్యవసాయ శాఖ నిర్వహించేది. మా ప్రభుత్వం దానిని బలోపేతం చేసింది. అంతర్జాతీయ ఏజేన్సీలు విపత్తు నిర్వహణ రంగంలో మన ఆవిష్కరణల పట్ల పొగడ్తలు కురిపించాయి' అని చెప్పారు. నేడు మనం స్వతంత్ర భారత కలలను పూర్తి చేసుకునే లక్ష్యాన్ని కలిగి ఉన్నామని అన్నారు. 100 ఏళ్ల స్వాతంత్య్రానికి ముందే నూతన భారతాన్ని నిర్మించాలని ఉద్ఘాటించారు. విపత్తు నిర్వహణ రంగంలో చేసిన కృషికి సుభాష్ చంద్రబోస్ ఆపద్ ప్రబంధన్ పురస్కారాన్ని అందజేశారు.

2019, 2020, 2021, 2022 లకు గాను ఈ అవార్డులను ఇస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి ఏటా జనవరి 23 అవార్డు ప్రకటిస్తామని తెలిపారు. దీనిలో ఒక సంస్థకు రూ.51లక్షలతో పాటు సర్టిఫికెట్, వ్యక్తులకు రూ.5లక్షలతో పాటు సర్టిఫికెట్ అందజేయనున్నారు. ప్రధాని మోడీ నేతాజీ స్వాతంత్ర్య ఉద్యమ భాగస్వామ్యానికి గౌరవంగా పరాక్రమ్ దివాస్‌ను నిర్వహిస్తూ చారిత్రాక నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఇది కేవలం గ్రానైట్ విగ్రహం మాత్రమే కాదని, నేతాజీకి దేశం ఇస్తున్న నివాళి అని తెలిపారు.


Next Story