ఫాక్స్‌కాన్-హెచ్‌సీఎల్.. చిప్‌ల తయారీ పరిశ్రమకు ప్రధాని మోడీ శంకుస్థాపన

by Ramesh Naini |

ఉత్తరప్రదేశ్‌లో ఫాక్స్‌కాన్, హెచ్‌సీఎల్ సంస్థల భాగస్వామ్యంతో చిప్ తయారీ ప్లాంట్‌కు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.

ఫాక్స్‌కాన్-హెచ్‌సీఎల్.. చిప్‌ల తయారీ పరిశ్రమకు ప్రధాని మోడీ శంకుస్థాపన
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్‌కు 'మేడ్ ఇన్ ఇండియా' సెమీకండక్టర్ చిప్ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో ఫాక్స్‌కాన్, హెచ్‌సీఎల్ (Foxconn-HCL) సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న సెమీకండక్టర్ చిప్ తయారీ ప్లాంట్‌కు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, సాంకేతిక రంగంలో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలపై భారత్ సమాన దృష్టి పెడుతోందని స్పష్టం చేశారు. సెమీకండక్టర్ల తయారీలో అరుదైన ఖనిజాల (Rare earth minerals) ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. ఆ దిశగా భారత్ ఇప్పటికే బలమైన చర్యలు తీసుకుంటోందని, సెమీకండక్టర్ పరిశ్రమకు ఊతమిచ్చేలా దేశంలో 'రేర్ ఎర్త్ కారిడార్ల'ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

దూసుకుపోతున్న 'మేక్ ఇన్ ఇండియా'

గత 11 ఏళ్లలో 'మేక్ ఇన్ ఇండియా' ఒక బలమైన బ్రాండ్‌గా దూసుకుపోతున్నదని మోడీ అన్నారు. దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ 6 రెట్లు, వాటి ఎగుమతులు 8 రెట్లు, మొబైల్ తయారీ ఏకంగా 28 రెట్లు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. సాంకేతిక ప్రపంచంలో భారత్ కేవలం సాఫ్ట్‌వేర్‌కే పరిమితం కాకుండా, హార్డ్‌వేర్ అభివృద్ధిపైనా సమాంతరంగా దృష్టి సారిస్తోందని ప్రధాని అన్నారు. సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కూడా భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. భారత్ అభివృద్ధి పథంలో అత్యంత వేగంగా దూసుకుపోతోందని ఎర్రకోట సాక్షిగా చెప్పినట్లు గుర్తుకు చేశారు. 2026 ప్రారంభం నుంచే మన ప్రగతి మరింత వేగవంతమైందని, ఈ వారం భారత్‌కు ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 'గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'ను ప్రధాని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల అధినేతలు, టెక్ దిగ్గజాలు ఈ సదస్సులో పాల్గొని భారత్ ఏఐ సామర్థ్యాన్ని, మన విజన్‌ను అర్థం చేసుకుని ప్రశంసించారని గుర్తుచేశారు.

Next Story