విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి.. మృతదేహం మిస్సింగ్ కలకలం!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-25 06:11:55  IST  )

ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్తున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ TK79 విమానంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.

విమానం గాల్లో ఉండగా ప్రయాణికుడు మృతి.. మృతదేహం మిస్సింగ్ కలకలం!
X

దిశ, వెబ్ డెస్క్: ఇస్తాంబుల్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో (Istanbul to San Francisco) వెళ్తున్న తుర్కిష్ ఎయిర్‌లైన్స్ (Turkish Airlines) TK79 విమానంలో ఓ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. విమానం గ్రీన్‌లాండ్ గగనతలంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. మృతుడిని ఇండియాకు చెందిన 83 ఏళ్ల సత్యనారాయణ పసుపులేటిగా గుర్తించారు. దాంతో విమాన సిబ్బంది విమానాన్ని ఐస్లాండ్‌లోని కెఫ్లావిక్‌ విమానాశ్రయానికి మళ్లించాలని భావించారు. అయితే, అది కుదరకపోవడంతో చికాగో ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాన్ని దారిమళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.

ఆ తరువాత, ప్రయాణికుడి మృతదేహాన్ని రూల్స్ ప్రకారం కుక్ కౌంటీ మెడికల్‌ ఎగ్జామినర్‌ కార్యాలయానికి (Cook County Medical Examiner) అప్పగించారు. అయితే, ఆ కార్యాలయం మాత్రం తమకు ఎలాంటి మృతదేహం అప్పగించలేదని, తమ రికార్డుల్లో దీనికి అనుగుణంగా ఎలాంటి కేసూ నమోదు కాలేదని వెల్లడించింది. దీంతో మృతదేహం మిస్సింగ్ కలకలం రేగింది.

ఇదిలా ఉండగా, తుర్కిష్ ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ఎర్తుగ్రుల్ గుల్సెన్ మృతదేహాన్ని చికాగో నుంచి మరో విమానంలో శాన్‌ఫ్రాన్సిస్కో తరలించినట్లు తెలిపారు. అయితే దానికి సంబంధించిన స్పష్టమైన సమాచారం మాత్రం ఇవ్వలేదు. మృతదేహం ఎలా, ఎప్పుడు శాన్‌ఫ్రాన్సిస్కో చేరింది అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story