- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సామాజిక న్యాయ పోరాటంలో డీఎంకేకే మా సంపూర్ణ మద్దతు: ఏఐఓబీసీఎస్‌ఏ
సామాజిక న్యాయం, కుల గణన సాధనే ప్రధాన లక్ష్యంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆవిష్కరించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సామాజిక న్యాయం, కుల గణన సాధనే ప్రధాన లక్ష్యంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ఆవిష్కరించారు. ఆదివారం చెన్నైలోని సీఎం నివాసంలో ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్ నేతృత్వంలోని లక్ష్మీనర్సయ్య, అశ్వన్, భారత్ వర్మలతో కూడిన ప్రతినిధి బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కుల గణన ఆవశ్యకతపై రూపొందించిన పుస్తకాన్ని వారు స్టాలిన్‌కు అందజేయగా.. ఆయన దానిని ఆవిష్కరించి, అసోసియేషన్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
సామాజిక న్యాయానికి చిరునామా స్టాలిన్..
పుస్తకావిష్కరణ అనంతరం ఏఐఓబీసీఎస్‌ఏ జాతీయ అధ్యక్షుడు కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో కుల గణన, బీసీల హక్కుల సాధన కోసం నిరంతరం గొంతెత్తుతున్న సీఎం స్టాలిన్ సామాజిక న్యాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారని కొనియాడారు. కేవలం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాల హక్కుల పరిరక్షణ కోసం డీఎంకే కూటమి చేస్తున్న పోరాటానికి తమ సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందని స్పష్టం చేశారు. కుల గణన అంశంపై సీఎం తమకు విలువైన సమయాన్ని కేటాయించి, నిర్మాణాత్మక చర్చ జరపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఓబీసీ కోటా అమలుపై ప్రశంసలు
నీట్ (NEET) పరీక్షతో పాటు నేషనల్ లా యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీల్లో ఓబీసీ కోటా అమలుకు స్టాలిన్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను విద్యార్థి నేతలు ఈ సందర్భంగా ప్రశంసించారు. అలాగే, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, యూజీసీ సోషల్ ఎక్విటీ నిబంధనలను అమలు చేయాలని డీఎంకే చేస్తున్న పోరాటాన్ని వారు అభినందించారు. కాగా, ఈ భేటీని సమన్వయం చేసి.. తమ సంఘం నిర్వహిస్తున్న ఉద్యమాల గురించి ముఖ్యమంత్రికి వివరించిన రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది పి. విల్సన్‌కు అసోసియేషన్ ప్రతినిధి బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.






