OTT Platforms: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. 43 ప్లాట్ ఫామ్స్ బ్లాక్

by B.Srinivas |

ఓటీటీల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే 43 ప్లాట్ ఫామ్‌లను బ్లాక్ చేసింది.

OTT Platforms: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్.. 43 ప్లాట్ ఫామ్స్ బ్లాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓటీటీల్లో అభ్యంతరకరమైన కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్న 43 ఓటీటీ ప్లాట్ ఫామ్‌లను బ్లాక్ చేసినట్టు బుధవారం పార్లమెంటుకు తెలిపింది. వాటిలో అశ్లీలమైన, వయోజన, హింసాత్మక, సాంస్కృతికంగా అభ్యంతరకరమైన కంటెంట్ ఉన్నట్టు పేర్కొంది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnaw) లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2021 ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000 ప్రకారం ప్రభుత్వం కొత్త డిజిటల్ నియమాలను అమలు చేసిందని, ప్రస్తుతానికి అమలులో ఉన్న చట్టం ద్వారా నిషేధించబడిన కంటెంట్ ప్రసారం చేయకూడదని, అలా చేస్తే ఓటీటీ ప్లాట్‌ఫామ్ లే బాధ్యత వహిస్తాయని హెచ్చరించారు.

ముఖ్యంగా పిల్లలకు హాని కలిగించే లేదా తప్పుదారి పట్టించే కంటెంట్ వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో పలు ఫిర్యాధుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. పిల్లలకు అనుచితమైన కంటెంట్‌ను నిరోధించేందుకు తగిన యాక్సెస్ నియంత్రణలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 79(3)(బి) ప్రకారం, చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగించేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని, ఇందులో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు.

Next Story