గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు..

by Disha Web Desk 13 |
గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు..
X

సూరత్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. రాహుల్ గాంధీ పిటిషన్‌పై వేసవి సెలవుల తర్వాత జూన్ 4న తుది తీర్పును వెలువరిస్తామని కోర్టు తెలిపింది. తన శిక్షను నిలుపుదల చేయాలంటూ రాహుల్ చేసిన విజ్ఞప్తిని సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది.

అయితే బెయిల్ మాత్రం మంజూరు చేసింది. దీంతో ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. గత బుధవారం గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ గీతా గోపి ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేసును జస్టిస్ హేమంత్ ప్రచ్చక్‌కి అప్పగించారు. "దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో" అని 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యంగ్య వ్యాఖ్యలు చేసినందుకు గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరువు నష్టం దావా కేసు వేశారు. దాన్ని ఈ ఏడాది మార్చి 23న విచారించిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా ప్రకటించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.



Next Story

Most Viewed