Nigeria: నైజీరియాలో రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి

by B.Srinivas |

నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు.

Nigeria: నైజీరియాలో రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: నైజీరియా (Nigeria) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ ఉత్తర ప్రాంతంలో తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మంది క్రీడాకారులు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అథ్లెట్లు ఓగున్ (Ogun) రాష్ట్రంలో జరిగిన 22వ జాతీయ క్రీడా ఉత్సవాలకు హాజరై ఉత్తర నైజీరియాలోని కానోకు తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో 21 మంది క్రీడాకారులు అక్కడి కక్కడే మరణించినట్టు ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ (ఎఫ్ఆర్‌ఎస్‌సీ) వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఇతర వాహనాల ప్రమేయం లేదని క్రీడాకారుల బస్సు అదుపు తప్పిందని తెలిపింది. సుదీర్ఘ ప్రయాణం కారణంగా డ్రైవర్ అలసిపోవడం లేదా అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పేర్కొంది.

ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు స్పందించారు. దేశానికి విషాదకరమైన రోజుగా అభివర్ణించారు. కాగా, నైజీరియాలో రోడ్డు ప్రమాదాలు సర్వ సాధారణంగా మారాయి. ఎఫ్ఆర్‌ఎస్‌సీ డేటా ప్రకారం గతేడాది నైజీరియాలో 9,570 రోడ్డు ప్రమాదాలు జరగగా 5,421 మంది మరణించారు. అధ్వాన్నమైన రోడ్లపై అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు నిరంతరం జరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.

Next Story