గంగమ్మ ఒడిలో విషాదం.. పవిత్రస్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-06 09:31:20  IST  )

గంగానదిలో పవిత్రస్నానం చేసి మొక్కులు తీర్చుకునేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు.. ప్రమాదవశాత్తు నదిలో కొట్టుకుపోయారు.

గంగమ్మ ఒడిలో విషాదం.. పవిత్రస్నానానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు..
X

దిశ, వెబ్‌డెస్క్: పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానం ఆచరించి మొక్కులు తీర్చుకుందామని వెళ్లిన రెండు కుటుంబాల్లో ఊహించని విషాదం నిండింది. నదిలో మునిగిపోతున్న పొరుగువాడిని కాపాడబోయి మరొకరు ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ రాజ్‌ నగర్ ఎక్స్‌టెన్షన్‌లోని ఒకే అపార్ట్‌మెంట్‌లో నివసించే సచిన్ త్యాగి (39), బ్రిజేష్ కుమార్ త్రిపాఠి (43) తమ కుటుంబాలతో కలిసి రెండు రోజుల క్రితం హరిద్వార్‌కు యాత్రకు వెళ్లారు. సచిన్ త్యాగి కుటుంబం ఇన్నోవాలో, బ్రిజేష్ కుటుంబం క్రెటా కారులో బయలుదేరారు. ఆదివారం గంగా నదిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాపాడబోయి తానూ.. గంటన్నర పాటు గాలింపు

నదిలో స్నానం చేస్తున్న క్రమంలో సచిన్ త్యాగి ఒక్కసారిగా లోతైన ప్రాంతంలోకి జారిపోయారు. నది ఉధృతికి ఆయన కొట్టుకుపోతుండటం గమనించిన పక్కనే ఉన్న బ్రిజేష్ త్రిపాఠి.. స్నేహితుడిని కాపాడేందుకు వెంటనే నీటిలోకి దూకారు. అయితే.. నీటి ప్రవాహం బలంగా ఉండటంతో ఇద్దరూ కలిసి లోతైన ప్రాంతానికి లాక్కెళ్లబడ్డారు. క్షణాల్లోనే ఇద్దరూ కళ్లముందే అదృశ్యమయ్యారు. స్థానికులు కేకలు వేయడంతో వెంటనే పోలీసులు, గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. సుమారు గంటన్నర పాటు గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అప్పటికే వారు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు సచిన్ త్యాగి నిర్మాణ రంగంలో పనిచేస్తుండగా, బ్రిజేష్ త్రిపాఠి గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

ఘాట్‌ల వద్ద పేరుకుపోయిన మట్టితోనే ప్రమాదం?

నదిలో స్నానం చేసే చోట గతంలో ఘాట్ ఉండేదని, అయితే కాలక్రమేణా మట్టి పేరుకుపోవడం వల్ల నది లోతును అంచనా వేయడం కష్టంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. లోతు తక్కువగా ఉందని భావించి అడుగు వేయడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రానికి క్షేమంగా ఇంటికి వస్తారనుకున్న తమ వారు విగతజీవులుగా మారుతారని ఆ కుటుంబ సభ్యులు ఊహించలేకపోయారు. ఒకే అపార్ట్‌మెంట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు మరణించడంతో ఘజియాబాద్‌లోని వారి నివాస సముదాయంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story