Australia: అమల్లోకి సోషల్ మీడియా ఏజ్ లిమిట్.. యాప్‍లను తెలివిగా మోసం చేస్తున్న టీనేజర్లు

by Prasad Jukanti |   (  Updated:2025-12-10 13:03:49  IST  )

16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియాలో నిషేధం అమల్లోకి వచ్చింది.

Australia: అమల్లోకి సోషల్ మీడియా ఏజ్ లిమిట్.. యాప్‍లను తెలివిగా మోసం చేస్తున్న టీనేజర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియాలో నిషేధం అమల్లోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి ఆ దేశ ప్రభుత్వం ‘ఆన్ లైన్ సేప్టీ అమెండ్ మెట్ (సోషల్ మీడియా మినిమం ఏజ్)’ బిల్లును అమల్లోకి తెచ్చింది. ఈ నిర్ణయంతో ఇవాళ ఉదయం నుంచి లక్షలాది మంది టీనేజర్లు తమ ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, థ్రెడ్స్, ఎక్స్, యూట్యూబ్, స్నాప్ చాట్, రెడ్డిట్, కిక్, ట్విచ్, టిక్ టాక్ వంటి ప్రధాన ప్లాట్ ఫామ్‍లను యాక్సెస్ ను కోల్పోయారు. తిరిగి వాటిల్లో లాగిన్ కావాలంటే తమ వయసు నిర్ధారించాల్సి వస్తోంది. ఈ మేరకు ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త వయస్సు ధ్రువీకరణ విధానాలను అమలులోకి తీసుకు వచ్చారు. అయితే ప్రభుత్వం తెచ్చిన ఆంక్షలను బద్ధలు కొడుతూ తప్పుడు మార్గాల్లో తిరిగి యాక్సెస్ పొందేందుకు అక్కడి టీనేజర్లు వేస్తున్న ఎత్తుగడలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాశంగా మారాయి. ఫలితంగా ఆస్ట్రేలియా మాదిరిగానే తమ దేశాల్లోనూ సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించాలని భావిస్తున్న మిగతా దేశాలను ఈ తాజా పరిణామాలు ఆలోచనలో పడేసేలా చేస్తున్నాయి.

వీపీఎన్ లు.. నకిలీ ఐడీలు:

సోషల్ మీడియా ఏజ్ లిమిట్ చట్టాన్ని అతిక్రమిస్తే భారీ జరినామాలు విధించే నిబంధనలు ఉన్నప్పటికీ చాలా మంది టీనేజర్లు ఈ రూల్స్ బ్రేక్ చేసి తిరిగి తమ ఖాతాలను పొందేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. సోషల్ మీడియా యూజ్ కోసం కొంత మంది తమ తల్లిదండ్రుల ఖాతాలను ఉపయోగించడం మొదలు పెడితే మరికొందరు తమ తల్లి ఫోటోను చూపించడం ద్వారా, మరి కొందరు వీపీఎన్‍లు ఉపయోగించడం ద్వారా తిరిగి తమ సోషల్ మీడియా ఖాతాలను యాక్సెస్ అవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 13 ఏళ్ల ఐసోబెల్ ఈ నిషేధాన్ని దాటవేయడానికి తనకు ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయం పట్టిందని ఓ న్యూస్ సంస్థకు వెల్లడించింది. తనకు 16 ఏళ్లు పైబడినట్లు నిరూపించుకోకపోతే ఆమెను తొలగిస్తామని స్నాప్‌చాట్ నోటిఫికేషన్ హెచ్చరించడంతో ఆమె ఆ యాప్ వయస్సు తనిఖీలను మోసగించడానికి తన తల్లి ఫోటోను ఉపయోగించిందని చెప్పుకొచ్చింది.

పెద్దవారిలా కనిపించడం ఎలా?:
మరికొందరు ఫేస్ స్కానింగ్‍ను బురిడీ కొట్టించేందుకు తమ రూపాన్ని మార్చుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా తమ తోబుట్టువు, తల్లిదండ్రులు లేదా 16 ఏళ్లకు పైబడిన మరొక వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయిస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో టీనేజ్ రూల్స్ దాటడానికి ఏయే మార్గాలు ఉన్నాయనే సమాచారాన్ని ఇతర ఫ్లాట్ ఫామ్‍లపై ఒకరికొకరు చేరవేసుకుంటున్నారు. కొంతమంది తమ నిజమైన వయసు కంటే పెద్దవారిలా కనిపించేందుకు ఫేస్ మాస్కులు కొనుగోలు చేస్తుండటం వైరల్‍గా మారుతోంది. మరికొంత మంది టీనేజర్లు ఫోటో వెరిఫికేషన్ కోసం తమను తాము ఎలా పెద్దవారిలా కనిపించాలి అనే అంశాన్ని తెగ వెతికేస్తున్నారని కథనాలు పేర్కొన్నాయి. ఫేషియల్ స్కానింగ్ టెక్నాలజీ కొంత వరకు తప్పుడుగా ఉందని 14 ఏళ్ల పిల్లవాడిని 17 ఏళ్ల పిల్లవాడని చూపిస్తోందని మరి కొంత మంది వాదిస్తున్నారు. ఆస్ట్రేలియనాను ఆదర్శంగా తీసుకుని మిగతా పలు దేశాలు ఆ దిశగా సోషల్ మీడియాపై బ్యాన్ చేయాలనే ఆలోచనల్లో ఉండగా ఈ ఆస్ట్రేలియా మోడల్ సక్సెస్ రేటు ఎంత ఉండబోతోందనేది చూడాలి మరి.

Next Story