నవ భారత్ ‘ప్రమాదకర సంస్థ’.. ఐరాస వేదికగా భారత్‌పై పాక్ కారు కూతలు

by Shamantha N |
నవ భారత్ ‘ప్రమాదకర సంస్థ’.. ఐరాస వేదికగా భారత్‌పై పాక్ కారు కూతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్‌పై మరోసారి పాకిస్తాన్ కారు కూతలు కూసింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ శాశ్వత రాయబారి మునీర్ అక్రమ్ భారత్‌పై మాటల దాడికి దిగారు.నవ భారత్ ను ప్రమాదకర సంస్థగా అభివర్ణించారు. పాక్ సహా పలు దేశాల్లో జరిగిన లక్షిత హత్యల్లో(టార్గెటెడ్ కిల్లింగ్స్) భారత్ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనక భారత్‌ ప్రమేయం ఉందంటూ గతంలో బ్రిటన్‌కు చెందిన ‘ది గార్డియన్’ డైలీ ప్రచురించిన సంచలన కథనం ఆధారంగా మునీర్ అక్రమ్ ఈ కామెంట్స్ చేశారు. భారత్‌ చర్యల గురించి భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీలకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ సమాచారాన్ని అందించిందన్నారు. పాక్, కెనడా, అమెరికాల్లోనూ భారత్ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. నవ భారతం ప్రమాదకర సంస్థ అని మునీర్ అక్రమ్ పేర్కొన్నారు. ‘‘భారత్ బలమైన ప్రభుత్వం ఉంది. ఉగ్రవాదులు తమ సొంత దేశాలకు పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ వారిని హతమారుస్తాం’’ అంటూ గతంలో మోడీ కామెంట్స్ చేశారు. 2023లో భారతదేశం లక్షిత హత్యలు చేసిందని.. 15 మంది మరణాల్లో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని నిఘా వర్గాలను ఉటంకిస్తూ ‘ది గార్డియన్’ డైలీ కథనంలో ప్రస్తావించింది. ఇక ఖలిస్థానీ అనుకూల నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వానికి ప్రమేయం ఉందని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో గతంలో ఆరోపించారు. భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) నియమించిన ఉగ్రవాదే నిజ్జర్‌ను హత్య చేశాడని పేర్కొన్నారు. ఈకేసులో ఇప్పటివరకు నలుగురు భారత పౌరులను కెనడా అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ హత్యలో తమ దేశం ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని భారత్ స్పష్టం చేసింది.

Next Story