Nagpur Violence: నాగ్ పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య

by Shamantha N |

నాగ్‌పూర్ అల్లర్ల సూత్రధారి , మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నేత ఫహీమ్ ఖాన్ ఇంటిపై మున్సిపల్ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టారు.

Nagpur Violence: నాగ్ పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ చర్య
X

దిశ, నేషనల్ బ్యూరో: నాగ్‌పూర్ అల్లర్ల సూత్రధారి , మైనారిటీ డెమోక్రటిక్ పార్టీ నేత ఫహీమ్ ఖాన్ ఇంటిపై మున్సిపల్ అధికారులు బుల్డోజర్ చర్య చేపట్టారు. సంజయ్ బాగ్ కాలనీలోని ఫహీమ్ ఖాన్ రెండంతస్తుల ఇంటి నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. మార్చి 20న నిందితుడి ఇంటిన తనిఖీ చేసిన అధికారులు.. అది మహారాష్ట్ర ప్రాంతీయ, పట్టణ ప్రణాళిక చట్టం- 1966ను ఉల్లంఘించిందని చెప్పారు. ఫహీమ్ ఖాన్ కుటుంబం మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యంలోని కొంత భూమిని ఆక్రమించినట్లు తెలిపారు. ఈ మేరకు నోటీసులు పంపారు. అక్రమనిర్మాణాన్ని తొలగించాలని 24 గంటల గడువు విధించారు. అయినప్పటికీ, ఆక్రమణలను తొలగించకపోవడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా.. ఫహీమ్ ఖాన్ ఆస్తిని మున్సిపల్ అధికారులు కూల్చివేయడం ఇదే మొదటిసారి. అంతకుముందు నాగ్ పూర్ లోని ఫహీమ్ ఖాన్ రెండు దుకాణాలను పోలీసులు సీజ్ చేశారు. అల్లర్ల సమయంలో వాటిని ఉపయోగించారని దర్యాప్తులో తేలడంతో సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఔరంగజేబు సమాధిపై వివాదం

బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తహా బుల్డోజర్ చర్యలు చేపడుతుందా అనే ప్రశ్నకు ఇటీవలే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమాధానమిచ్చారు. "చట్టం అనుమతిస్తే బుల్డోజర్లు నడుస్తాయి" అని చెప్పారు. ఆ తర్వాత రెండ్రోజులకే ఈ చర్య జరగడం గమనార్హం. ఇకపోతే, మార్చి 17న నాగ్‌పుర్‌ (Nagpur)లో ఔరంగజేబు సమాధి వివాదంపై హింస జరిగింది. కొందరు మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ తర్వాత ఉద్రిక్తతలను పెంచేలా నినాదాలు చేయడంతో హింసాత్మకంగా మారింది. హింసలో 40 మంది గాయపడ్డారు. వారిలో ఒకరు శనివారం గాయాలతో మరణించారు.

Next Story