Budget 2024 Live Updates : మొరార్జీ దేశాయ్ రికార్డు సమం

by Dishanational2 |
Budget 2024 Live Updates : మొరార్జీ దేశాయ్ రికార్డు సమం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో గురువారం మధ్యంతర బడ్జెట్-2024ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును సమం చేశారు. మొరార్జీ ఆర్థిక మంత్రిగా 1959-1964 మధ్య కాలంలో ఐదు వార్షిక బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. 2019 నుంచి 2024 వరకు సీతారామన్ సైతం ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. అంతేగాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు వరుసగా ఐదుసార్లు బడ్జెట్‌లను ప్రవేశపెట్టగా వీరందరినీ సీతారామన్ అధిగమించారు. కాగా, 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ తర్వాత బడ్జెట్‌ను సమర్పించిన రెండో మహిళగా ఘనత సాధించిన విషయం తెలిసిందే. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ 58 నిమిషాల పాటు ప్రసంగించారు.

సీతారామన్ నేపథ్యం

1959 ఆగస్టు 18న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన సీతారామన్..న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టా పొందింది. 2003-05మధ్య కాలంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా పనిచేశారు. 2010లో బీజేపీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2014, 2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో మోడీ కేబినెట్‌లో రక్షణ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతేగాక ఇందిరాగాంధీ అనంత‌రం దేశానికి రెండో మ‌హిళా ర‌క్షణ మంత్రిగా పనిచేశారు. నిర్మల హయాంలోనే పుల్వామా దాడికి ప్రతీకారంగా సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. 2019లో ఆర్థిక మంత్రిగా నియమితులు కాగా.. అప్పటి నుంచి బాధ్యతల్లో ఉన్నారు.


Next Story

Most Viewed