'మోడీ గ్యారెంటీలకు జీరో వారెంటీ': టీఎంసీ ర్యాలీలో అభిషేక్ బెనర్జీ

by Dishanational1 |
మోడీ గ్యారెంటీలకు జీరో వారెంటీ: టీఎంసీ ర్యాలీలో అభిషేక్ బెనర్జీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మోడీ గ్యారెంటీలకు ఎలాంటి వారెంటీ ఉండదని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత అభిషేక్ బెనర్జీ అన్నారు. ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్.. బీజేపీ నాయకులను బయటి వ్యక్తులని, బెంగాల్ వ్యతిరేకులని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు రాష్ట్రాన్ని సందర్శిస్తారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ, ఆదివారం 'జన గర్జన్ సభ' ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ బెనర్జీ.. 'మోడీ ఇచ్చే గ్యారెంటీలకు జీరో వారెంటీ' ఉంటుందని, కేవలం మమతా బెనర్జీ, టీఎంసీ మాత్రమే ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాయ'న్నారు. బెంగాల్‌కు రావాల్సిన నిధులను నిలిపేసినందుకు రాష్ట్ర ప్రజలు తగిన సమాధానం చెబుతారని తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ చేత దాడులు చేయించి ఎన్నికల్లో పాల్గొన్నంత మాత్రాన ఎలాంటి ఫలితాలు బీజేపీకి ఉండవని అభిషేక్ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఎంసీ తరపున భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్, నటులు దీపక్ అధికారి, దేవ్, సయోని ఘోష్, కకోలి ఘోష్ దస్తిదార్ వంటి ప్రముఖులు బరిలోకి దిగనున్నారు.


Next Story