Maoists: కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టుల మృతి.. సీఆర్‌పీఎఫ్ డీజీ జీపీ సింగ్ వెల్లడి

by B.Srinivas |

కర్రెగుట్టల్లో 21 రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టు సీఆర్‌పీఎఫ్ డీజీ జీపీ సింగ్ తెలిపారు.

Maoists: కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టుల మృతి.. సీఆర్‌పీఎఫ్ డీజీ జీపీ సింగ్ వెల్లడి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అడవుల్లో 21 రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డీజీ జీపీ సింగ్ (Gp singh) తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టుల ముగింపునకు ప్రారంభమని చెప్పారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. 31 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, వారిలో 28 మందిని గుర్తించామన్నారు. మరణించిన నక్సలైట్లలో 16 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్టు తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టుల మౌలిక సదుపాయాలు కూల్చేశామని దాదాపు 216 రహస్య స్థావరాలు, బంకర్లను ధ్వంసం చేశామని తెలిపారు. భారీగా ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటివరకు గుర్తించిన మావోయిస్టుల తలలపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందని తెలిపారు.

2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను అణచివేస్తాం

2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు పూర్తిగా అంతమవుతారని తెలిపారు. దీనికి కట్టుబడి ఉన్నామని అందుకే భారీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నామన్నారు. 2014లో ప్రారంభమైన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ 2019 నుంచి తీవ్రమైందన్నారు. 2014లో మావోయిస్టు ప్రాబల్యం అధికంగా ఉన్న జిల్లాల సంఖ్య 35 ఉండగా, 2025 నాటికి ఆరుకు తగ్గిందని తెలిపారు. అలాగే నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 126 నుంచి18కి తగ్గిందన్నారు. 2014లో 1,080 నక్సలైట్ హింస సంఘటనలు జరిగాయని, 2024లో అది 374కి తగ్గిందని వెల్లడించారు.2024లో 928 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారని, ఈ ఏడాది ఇప్పటివరకు మరో 718 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు.

Next Story