Mahakumb: భక్తులపై హెలికాప్టర్‌తో పూలవర్షం.. మహాకుంభమేళాలో సందడి

by B.Srinivas |

వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు సోమవారం భారీగా పోటెత్తారు.

Mahakumb: భక్తులపై హెలికాప్టర్‌తో పూలవర్షం.. మహాకుంభమేళాలో సందడి
X

దిశ, నేషనల్ బ్యూరో: వసంత పంచమి సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు సోమవారం భారీగా పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు తరలిరావడంతో ఘాట్‌ల వద్ద రద్దీ నెలకొంది. ఉదయం ఆరు గంటల వరకే 62లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయగా సాయంత్రం నాటికి ఆ సంఖ్య 1.98 కోట్లకు చేరినట్టు అధికారులు వెల్లడించారు. సంగమానికి వెళ్లే అన్ని మార్గాల్లో భక్తుల సందడి నెలకొంది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం పకడ్భంధీ ఏర్పాట్లు చేసింది. సీఎం యోగీ ఆదిత్యనాథ్ (Yogi aadithyanath) ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దీంతో రద్దీ పెరిగినప్పటికీ జాతర ప్రశాంతంగా ముగిసింది. బసంత పంచమి అమృత్ స్నాన్ పురస్కరించుకుని భక్తులపై హెలీకాప్టర్‌తో పూల వర్షం కురిపించారు.

34.97 కోట్ల మంది పవిత్ర స్నానాలు

జాతర ప్రారంభమైన జనవరి 13 నుంచి 34.97 కోట్ల మంది ప్రజలు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసినట్టు అధికారులు వెల్లడించారు. బసంత పంచమి పురస్కరించుకుని రెండు రోజుల్లోనే ఆదివారం, సోమవారం సుమారు నాలుగు కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. ఈ నెల 26వరకు జాతర కొనసాగనుండగా రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తు్న్నారు. అయితే ఇక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి ఏకే శర్మ (Ak sharma) తెలిపారు. మహా కుంభమేళాకు కొద్ది రోజులే ఉన్నందున భక్తులు తరలిరావాలని కోరారు.

Next Story