Languages: త్రిభాషా విధానంపై తమిళనాడులో బీజేపీ ప్రచారం.. మార్చి 1 నుంచి ప్రారంభం

by B.Srinivas |

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రి భాషా విధానాన్ని డీఎంకే వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Languages: త్రిభాషా విధానంపై తమిళనాడులో బీజేపీ ప్రచారం.. మార్చి 1 నుంచి ప్రారంభం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన త్రి భాషా విధానాన్ని తమిళనాడులోని ద్రవిడ మున్నేట్ర కజగం (Dmk) సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. త్రి భాషా సూత్రాన్ని ఎందుకు తీసుకొచ్చామనే దానిపై రాష్ట్రంలో క్యాంపెయిన్ (campaign) నిర్వహించనున్నట్టు తెలిపింది. దీనిపై ఇంటింటికీ ప్రచారం చేపట్టి ప్రజలకు వివరించనున్నట్టు పేర్కొంది. మార్చి 1 నుంచి ఈ క్యాంపెయిన్ ప్రారంభం కానున్నట్టు వెల్లడించింది. త్రి భాషా విధానాన్ని డీఎంకే వ్యతిరేకించడం అంటే అంబేడ్కర్ (Ambedkar) నిర్దేశించిన రాజ్యాంగ సూత్రాలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. పిల్లలు తమ మాతృభాష తమిళంతో పాటు తమకు నచ్చిన భాషలను నేర్చుకోకుండా నిరోధించడం న్యాయం కాదని తెలిపింది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీని మూడో భాషగా చదవడానికి విద్యార్థులను అనుమతించబోమని సీఎం స్టాలిన్ చేసిన ప్రకటన భారత రాజ్యాంగంలోని ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని విమర్శించింది.

కాగా, తమిళనాడు పాఠశాలల్లో అక్కడి ప్రభుత్వం ద్వి భాషా సూత్రాన్ని పాటిస్తోంది. స్కూళ్లలో కేవలం ఇంగ్లీష్ (English), తమిళం (Tamil) మాత్రమే బోధిస్తోంది. గతంలోనూ ఆ రాష్ట్రంలో త్రి భాషా విధానాన్ని ఎప్పుడూ ఆమోదించలేదు. కానీ కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్ఈపీ)లో భాగంగా త్రి భాషా సూత్రాన్ని ప్రతి రాష్ట్రం తప్పకుండా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం పాలసీని తీసుకొచ్చింది. దీనిని డీఎంకే వ్యతిరేకిస్తోంది. అంతేగాక ఎన్‌ఈపీని పూర్తిగా అమలు చేయకపోతే సమగ్ర శిక్షా స్కీమ్ కింద నిధులు అందజేయబోమని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల ప్రకటించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలు విద్యా విధానాన్ని స్వీకరించినప్పుడు, తమిళనాడు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలోనే బీజేపీ క్యాంపెయిన్ చేపట్టడానికి సిద్ధమైంది.

Next Story