లేడీ కిల్లర్.. అందంగా ఉన్నారని ముగ్గురిని.. చివరికి కన్న కొడుకుని కూడా!?

by Ramesh Naini |

ఓ మహిళ వరుసగా నాలుగు చిన్నారులను హతమార్చిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

లేడీ కిల్లర్.. అందంగా ఉన్నారని ముగ్గురిని.. చివరికి కన్న కొడుకుని కూడా!?
X

దిశ, డైనమిక్ బ్యూరో: హర్యానా రాష్ట్రంలోని పానీపట్‌ జిల్లాలో ఓ మహిళ వరుసగా నాలుగు చిన్నారులను హతమార్చిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందంగా కనిపించే బాలికలను చూసి అసూయతో చంపేసినట్టు నిందితురాలు పోలీసుల విచారణలోఒప్పుకుంది. అంతేకాకుండా తనపై అనుమానం రాకుండా తన కన్న కొడుకుని కూడా ఇదే విధంగా హతమార్చినట్టు ఒప్పుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోనీపట్‌లోని ఒక బంధువు పెళ్లికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆరేళ్ల విధి అనే బాలిక సోమవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యింది. దీనితో కుటుంబ సభ్యులు వెతికినప్పటికీ ఆమె కనిపించలేదు. సుమారు గంట తర్వాత ఇంటి మొదటి అంతస్తులో ఉన్న స్టోర్ రూమ్ తలుపు వెలుపల నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన విధి అమ్మమ్మ తలుపు తీసి చూడగా, నీటి టబ్‌లో తల మునిగిన స్థితిలో విధి పడి ఉండటం కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తరలించినా వైద్యులు బాలిక అప్పటికే మృతిగా ప్రకటించారు.

విచారణలో బయటపడిన షాకింగ్‌ నిజం

విధి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విధికి వరసకు అత్త అయిన పూనమ్‌నే హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె కుటుంబ సభ్యులు వివాహ ఊరేగింపుతో వెళ్లిన సమయంలో పై అంతస్తులోకి తీసుకెళ్లి నీటి టబ్‌లో ముంచి చంపేసిందని విచారణలో తేలింది.

ముగ్గురు చిన్నారుల్ని హతమార్చిన నిందితురాలు

పూనమ్‌కు ఇది మొదటి హత్య కాదు. 2023లో తన వదిన కుమార్తెను ఇదే తీరులో టబ్‌లో ముంచి చంపింది. తన మీద అనుమానం రాకుండా ఉండేందుకు అదే ఏడాది తన కొడుకుని హతమార్చింది. ఈ ఆగస్టులో సివాహ్ గ్రామంలో మరో బాలికను ‘తనకంటే అందంగా కనిపించింది’ అనే కారణంతో చంపేసింది. ఇప్పటి వరకు ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు కాగా, విధి హత్య కేసులో పూనమ్‌ విచారణలో నిజాలు బయటపెట్టడంతో వరుస హత్యల దారుణం వెలుగులోకి వచ్చింది.

అందమే హత్యలకు కారణం..

పూనమ్‌ ఒప్పుకున్న వివరాల ప్రకారం.. అందంగా కనిపించే చిన్నారులపై అసూయ, ఎవ్వరూ తనకంటే అందంగా ఉండకూడదనే వికృత భావన ఇవే ఈ నేరాలకు ప్రధాన కారణాలు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పానీపట్‌, సోనీపట్‌ ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా, పూనమ్‌ను తాజాగా రిమాండ్‌కు తరలించారు.

Next Story