300 శాతం అధిక ధరకు పీపీఈ కిట్ల కొనుగోలు

by Ajay Maddhiboyina |

పీపీఈ కిట్లను అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ 10.23 కోట్ల అధిక భారం పడినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది.

300 శాతం అధిక ధరకు పీపీఈ కిట్ల కొనుగోలు
X

- మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతున్న పట్టించుకోలేదు

- కేరళ ప్రభుత్వంపై కాగ్ రిపోర్టు

దిశ, నేషనల్ బ్యూరో:

కోవిడ్-19 సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం కొనుగోలు చేసిన పీపీఈ కిట్ల కోసం 300 శాతం అధిక ధర చెల్లించారని కాగ్ ఆరోపించింది. మార్కెట్లో తక్కువ ధరకు పీపీఈ కిట్లు దొరుకుతున్నా పట్టించుకోకుండా వృధా ఖర్చు చేశారని కేరళ ప్రభుత్వాన్ని కాగ్ నిందించింది. రెగ్యులర్‌గా పీపీఈ కిట్లు సప్లయ్ చేసే వారిని, లోకల్ మార్కెట్‌లో తక్కువ ధరకు సరఫరా చేసే వారిని పట్టించుకోకుండా.. 2020 ఏప్రిల్, మే నెలల్లో 300 శాతం అధిక ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు కాగ్ తెలిపింది. అంతకు ముందు కొనుగోలు చేసిన రేట్ల కంటే కూడా ఆ రెండు నెలల్లో చెల్లించిన ధర ఎక్కువగా ఉన్నట్లు కాగ్ పేర్కొంది. పీపీఈ కిట్లను అధిక ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ 10.23 కోట్ల అధిక భారం పడినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. కోవిడ్ సమయంలో కేరళ ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇతర మెటీరియల్ విషయంలో కూడా అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. అయితే కోవిడ్ అత్యవసర పరిస్థితిలో సమయానికి అందించే వారి వద్ద ఆ సామాగ్రి కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఓ సంస్థ ఒక్కో పీపీఈ కిట్‌ను రూ.550ను సరఫరా చేస్తామని ప్రతిపాదించింది. కానీ కేరళ ప్రభుత్వం మాత్రం రూ.800 నుంచి రూ.1,550 చెల్లించి కిట్లను కొన్నట్లు కాగ్ చెప్పింది. మరోవైపు నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదించిన కాసర్‌గాడ్, వాయనాడ్‌లో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆ రెండు కళాశాల అనుమతులు రద్దు చేసిందని.. దీంతో అనేక మంది వైద్య విద్యార్థుల ఆశలపై గండి పడిందని కాగ్ పేర్కొంది.

Next Story