కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. విద్యాసంస్థల్లో పాత నిబంధనలకు చెక్

by Kema Shiva Kumar |

కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. విద్యాసంస్థల్లో పాత నిబంధనలకు చెక్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka)లోని విద్యాసంస్థల్లో హిజాబ్ (Hijab) ధరించడంపై ఉన్న నిషేధాన్ని ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022లో అప్పటి ప్రభుత్వం విధించిన ఈ వివాదాస్పద నిషేధాన్ని రద్దు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించకూడదనే నిబంధనను ప్రభుత్వం అధికారికంగా తొలగించింది. దుస్తులు ధరించడం అనేది వ్యక్తిగత నిర్ణయమని, ఆహారం, వేషధారణ విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండకూడదని ప్రభుత్వం పేర్కొంది. హిజాబ్‌తో పాటు జంధ్యం, రుద్రాక్ష సహా మతపరమైన వస్త్రధారణను ధరించేందుకు ఇక నుంచి అనుమతించనున్నారు.

కాగా, 2022లో ఉడిపి (Udupi)లోని ఓ ప్రభుత్వ కళాశాలలో మొదలైన ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో దీనిపై కర్ణాటక హైకోర్టు (Karnataka High Court), సుప్రీంకోర్టు (Supreme Court)లో కూడా విచారణలు జరిగాయి. విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదని, అందరూ తమ ఇష్టానుసారం దుస్తులు ధరించవచ్చని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అయితే, కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. మైనారిటీ వర్గాలు దీనిని స్వాగతిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విద్యాసంస్థల్లో క్రమశిక్షణ దెబ్బతింటుందని గోల చేస్తున్నారు.

Next Story