CJI: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం

by S Gopi |

దళిత నేపథ్యం కలిగిన రెండో వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం చారిత్రక మైలురాయిగా నిలవనుంది.

CJI: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత అత్యున్నత న్యాయస్థానానికి 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి మంగళవారం రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. మే 14న జస్టిస్‌ బీఆర్ గవాయి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన పదవీ విరమణ తేదీ అయిన నవంబర్ 23, 2025 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. మాజీ సీజేఐ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవిని చేపట్టనున్న దళిత నేపథ్యం కలిగిన రెండో వ్యక్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ నియామకం చారిత్రక మైలురాయిగా నిలవనుంది. మే 13, 2025న ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఖన్నా పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ బీఆర్ గవాయ్ తండ్రి ఆర్ ఎస్ గవాయ్ గతంలో పలు రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేశారు.

మహారాష్ట్రలోని అమరావతికి చెందిన బీఆర్ గవాయ్ నవంబర్ 24, 1960న జన్మించారు. 1985లో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1987-1990 మధ్య ముంబై హైకోర్టులో స్వతంత్ర న్యాయవాదిగా చేసిన పనిచేశారు. 1990 తర్వాత నాగ్‌పూర్ బెంచ్ ముందు ప్రాక్టీస్ చేశారు. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్, అమరావతి యూనివర్సిటీలకు స్టాండింగ్ కౌన్సెల్‌గా ఉన్నారు. ఆగస్ట్, 1992 నుంచి జూలై, 1993 వరకు బొంబాయి, నాగ్‌పూర్ బెంచ్‌లోని హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్‌లో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేశారు. జనవరి 17, 2000న నాగ్‌పూర్ బెంచ్‌కు ప్రభుత్వ ప్లీడర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, నవంబర్ 14, 2003న హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నవంబర్ 12, 2005న బొంబాయి హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఆ తర్వాత మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు.

Next Story