Adani: ఫిబ్రవరి 7న గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ పెళ్లి..

by Shamantha N |

ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్‌ అదానీ (Gautam Adani) ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఆయన చిన్న కుమారుడు జీత్‌ అదానీ (Jeet Adani)కి, దివా జైమిన్‌ షా (Diva Jaimin Shah)తో ఫిబ్రవరి 7న వివాహం జరగనుంది.

Adani: ఫిబ్రవరి 7న గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ పెళ్లి..
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతమ్‌ అదానీ (Gautam Adani) ఇంట పెళ్లి పనులు షురూ అయ్యాయి. ఆయన చిన్న కుమారుడు జీత్‌ అదానీ (Jeet Adani)కి, దివా జైమిన్‌ షా (Diva Jaimin Shah)తో ఫిబ్రవరి 7న వివాహం జరగనుంది. అహ్మదాబాద్‌లో నిరాడంబరంగా, సంప్రదాయ పద్ధతిలో జీత్ వివాహం జరగనుంది. అయితే, ఈ తరుణంలోనే పెళ్లికి సంబంధించిన పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. ఈమేరకు అదానీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘జీత్‌, దివ.. వారి వైవాహిక జీవితాన్ని పవిత్ర సంకల్పంతో ప్రారంభించడం సంతోషకరమైన విషయం. 500 మంది దివ్యాంగ సోదరీమణులకు వివాహం నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే 'మంగళ సేవ' చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక తండ్రిగా, ఈ 'మంగళ సేవ' నాకు అపారమైన సంతృప్తిని ఇచ్చింది. ఇలాంటి సేవా మార్గంలో జీత్‌, దివా ముందుకు సాగేందుకు వారికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను’’ అని అదానీ సంతోషం వ్యక్తంచేశారు. దానికి సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు.

జీత్ అదానీ..

ఇకపోతే, జీత్‌ అదానీ యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా నుంచి ఇంజనీరింగ్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌లో పట్టా పొందారు. 2019లో అదానీ గ్రూప్‌లో చేరారు. స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, క్యాపిటల్ మార్కెట్స్‌ వంటి విభాగాల బాధ్యతలు చూస్తున్నారు. అదానీ ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారంతో పాటు అదానీ డిజిటల్‌ ల్యాబ్స్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. దివా.. గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్‌ షా కుమార్తె. మార్చి 14, 2023న జీత్, దివా నిశ్చితార్థ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అహ్మదాబాద్ లో నిశ్చితార్థ వేడుకను జరుపుతున్నారు. అయితే, పెళ్లి కూడా అహ్మదాబాద్‌లోనే జరిపించనున్నారు.

Next Story