ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగం రోజే అలా..

by Dishanational4 |
ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ‘ఆదిత్య-ఎల్1’ ప్రయోగం రోజే అలా..
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చీఫ్ ఎస్.సోమనాథ్‌కు ‘ఆదిత్య-ఎల్1’ సోలార్ మిషన్ ప్రయోగం రోజునే(సెప్టెంబరు 2న) క్యాన్సర్ నిర్ధారణ అయిందట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్.సోమనాథ్‌ స్వయంగా ఈవిషయాన్ని వెల్లడించారు. ‘‘వాస్తవానికి చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలోనే నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే వాటిని నేను పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా రెండు నెలల తర్వాత ఆదిత్య-ఎల్1 లాంచ్ రోజున నేను బాడీ స్కానింగ్స్ చేయించుకోగా అసలు సమస్య బయటపడింది. కడుపులో క్యాన్సర్ కణితి పెరుగుతోందని వెల్లడైంది. ప్రయోగం జరిగిన వెంటనే నాకు ఈ సమాచారం అందింది’’ అని ఇస్రో చీఫ్ వివరించారు. ‘‘అనంతరం చెన్నైకి వెళ్లి మరోసారి స్కానింగ్‌ చేయించుకోగా.. అది క్యాన్సరే అని కన్ఫార్మ్ అయింది. ఆ తర్వాత రెండు, మూడు రోజుల పాటు ఇంకొన్ని పరీక్షలు చేయించుకోగా సేమ్ టు సేమ్ రిజల్ట్ వచ్చింది. అనంతరం నాకు డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ వెంటనే కీమోథెరపీ జరిగింది’’ అని ఎస్.సోమనాథ్‌ చెప్పుకొచ్చారు. ఈవిషయాన్ని తన సమీప బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే తెలియజేశానన్నారు. ఇప్పుడు తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు ఆయన తెలిపారు. క్యాన్సర్ నయం కాని వ్యాధి అనే భావన తప్పు అని తన విషయంలో రుజువైందని ఇస్రో చీఫ్ చెప్పారు.


Next Story

Most Viewed