మణిపుర్‌లో సాయుధ ముఠాలపై ఉక్కుపాదం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

by Kema Shiva Kumar |

మణిపుర్‌లో శాంతి స్థాపనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

మణిపుర్‌లో సాయుధ ముఠాలపై ఉక్కుపాదం.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: హింసాత్మక ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో శాంతి పునరుద్ధరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అటవీ యుద్ధ తంత్రంలో ఆరితేరిన రెండు ప్రత్యేక ‘కోబ్రా’ (COBRA - Commando Battalion for Resolute Action) బెటాలియన్లను మణిపుర్‌కు తరలించాలని కేంద్రం నిర్ణయించింది. మణిపుర్‌లో తిష్టవేసి అశాంతికి కారణమవుతున్న వివిధ సాయుధ ముఠాలపై ఈ కోబ్రా దళాలు నేరుగా స్పెషల్ ఆపరేషన్లు చేపడతాయని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు, అడవుల్లో వ్యూహాత్మకంగా దాడులు చేయడంలో ఈ కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది. స్థానిక ఉగ్ర, సాయుధ ముఠాల కదలికలను అణచివేయడానికి ఈ దళాలు రంగంలోకి దిగనున్నాయి.

కాగా, మణిపుర్‌లో మైతేయ్‌, కుకీ గిరిజన జాతుల మధ్య 2023 నుంచి తీవ్రస్థాయిలో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సుదీర్ఘ జాతి వైరం, హింసాత్మక ఘటనల కారణంగా ఇప్పటి వరకు 260 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, అక్కడ సాధారణ పరిస్థితులను తీసుకురావడానికి రాబోయే రోజుల్లో కేంద్ర బలగాలు మరింత కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.

Next Story