- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూఎస్ బేస్‌లు టార్గెట్ చేస్తాం.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
యూఎస్ బేస్‌లు టార్గెట్ చేస్తామని ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. దీంతో అమెరికా తన స్థావరాలను ఖాళీ చేస్తున్నట్లు సమాచారం.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారింది. నిరసనకారులకు యూఎస్ సహా పలు దేశాలు మద్దతిస్తున్న నేపథ్యంలో.. ఇరాన్, అమెరికా మధ్య కూడా పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇటీవలే నిరసనకారుల కోసం తాము ఇరాన్‌పై దాడులు చేయడానికి సిద్ధమని ట్రంప్ ప్రకటించగా.. తమపై దాడి చేస్తే మిడిల్ ఈస్ట్‌లోని యూఎస్ బేస్‌లపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే ఈ నిరసనల్లో 12 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ పేర్కొంది. ఈ నిరసనల్లో పాల్గొంటున్న వారిపై కన్నెర్ర చేసిన ఖమేనీ ప్రభుత్వం.. వారిని అరెస్టులు చేసి వేగంగా విచారణ జరిపి మరణశిక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశ న్యాయవ్యవస్థ ఈ విషయంపై హింట్ ఇవ్వడంతో నిరసనకారుల్లో కూడా టెన్షన్ మొదలైంది. దీంతో వారు బోర్డర్లు దాటి తుర్కియే సహా పలు దేశాల్లో తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరాన్‌లో పరిస్థితులను చర్చించేందుకు ఆ దేశ రాయబారికి స్వీడన్ ప్రభుత్వం సమన్లు పంపింది. ఇప్పటికే ఇంటర్నెట్ బంద్ చేసిన ఇరాన్ సర్కారు.. మరో మూడు వారాల వరకు దేశంలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబోమని స్పష్టంచేసింది. ఇంటర్నెట్ వల్ల ఈ నిరసనలు మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరణశిక్షలు వేయొద్దు: ట్రంప్ వార్నింగ్
నిరసనకారులకు ఇరాన్‌లో మరణశిక్షలు వేయడాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. ఇప్పటికే ఆ దేశంలో 2403 మందికిపైగా మరణించినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను అరెస్టు చేసి, వారిపై వేగంగా విచారణ జరిపి మరణశిక్షలు విధిస్తోంది ఖమేనీ ప్రభుత్వం. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ట్రంప్.. ‘నేను ఈ ఉరిశిక్షల గురించి వినలేదు. కానీ నిరసనకారులకు ఇరాన్ కనుక మరణశిక్షలు విధిస్తే.. చాలా తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ఇటీవలే ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోవాలంటూ ఇరాన్ నిరసనకారులకు ట్రంప్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
మీరే హంతకులు..
ట్రంప్ వార్నింగ్‌పై ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు అలీ లారిజాని తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ప్రజలను చంపుతోంది ట్రంప్, నెతన్యాహునే అని ఆరోపించారు. ‘ఇరాన్ ప్రజలను చంపుతున్న ప్రధాన హంతకుల పేర్లు ప్రకటిస్తున్నా.. ట్రంప్, నెతన్యాహు’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనికి నిరసనకారులను రెచ్చగొట్టిన ట్రంప్ సోషల్ మీడియా పోస్టును జతచేశారు. ఇదే సమయంలో యూఎస్ కనుక తమపై దాడులు చేస్తే.. సౌదీ అరేబియా, యూఏఈ, తుర్కియే దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే ఈ దేశాలకు ఈ సమాచారం అందించినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ క్రమంలో తమ భూభాగం మీద నుంచి ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగవని సౌదీ అరేబియా హామీ ఇచ్చింది.
మిలిటరీ బేస్‌లు ఖాళీ చేస్తున్న యూఎస్?
ఇరాన్ హెచ్చరికలతో మిడిల్ ఈస్ట్‌లోని పలు యూఎస్ బేస్‌లను ఖాళీ చేయాలని అగ్రరాజ్యం నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా ఖతార్‌లోని అల్-ఉదీద్ ఎయిర్‌బేస్ నుంచి పలువురు అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ వార్తలను ఖండించిన యూఎస్ దౌత్యవేత్తలు.. సైనిక స్థావరాలను తాము ఖాళీ చేయడం లేదని, కేవలం అక్కడ పొజిషన్స్‌లో మార్పులు చేస్తున్నామని చెప్తు్న్నారు.
ఇరాన్‌లో ఉండొద్దు..
టెహ్రాన్‌లో పరిస్థితులు చేతులు దాటిపోతున్న వేళ.. అక్కడ భారతీయులెవరూ ఉండొద్దని విదేశాంగ శాఖ హెచ్చరించింది. ప్రయాణానికి అవసరమైన పత్రాలన్నింటినీ దగ్గర ఉంచుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఇరాన్ వీడాలని సూచించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఆ దేశానికి ప్రయాణాలు కూడా మానుకోవాలని తెలిపింది. ప్రయాణాలకు ఏ మార్గం దొరికితే ఆ మార్గంలో ఇరాన్‌ను వీడాలని, ఆ దేశంలో ఉండొద్దని పేర్కొంది. అక్కడే ఉండే వారు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఆందోళనలు జరిగే ప్రాంతాలను పూర్తిగా ఎవాయిడ్ చేయాలని సూచించింది. అమెరికా ప్రభుత్వం కూడా ఇరాన్‌లోని తమ దేశ పౌరులకు ఇలాంటి అడ్వయిజరీనే జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఫోన్ చేశారు. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితుల గురించి తాము చర్చించినట్లు జైశంకర్ వెల్లడించారు.






