- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: మహిళల వక్షోజాలు తాకడం నేరం కాదన్న జడ్జి.. ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. మహిళ వక్షోజాలను తాకడం, పైజామా పట్టుకుని లాగడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

దిశ, నేషనల్ బ్యూరో: లైంగిక వేధింపుల కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. మహిళ వక్షోజాలను తాకడం, పైజామా పట్టుకుని లాగడం వంటివి లైంగిక వేధింపుల కిందకు రావని అలహాబాద్ హైకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపైనే సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం సుమోటోగా విచారణ చేపట్టింది. ఆ న్యాయమూర్తి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ జడ్జి వ్యాఖ్యలు ఏమాత్రం సున్నితమైనవి కావని, అమానవీయంగా ఉన్నాయని జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం విచారం వ్యక్తంచేసింది. ఈ కేసులో తీర్పును తక్షణమే ప్రకటించలేదని, తీర్పును రిజర్వ్ చేసిన నాలుగు నెలల తర్వాత వెలువరించారని గుర్తుచేసింది. అక్కడ లోపాలు జరిగి ఉంటాయని భావించామంది. అయితే, కేసు ఈ దశలో ఉండగా సాధారణంగా స్టే ఇవ్వడానికి వెనుకాడతామంది. కానీ ఈ కేసులోని పరిశీలనలు చట్టానికి తెలియనివని.. అమానవీయ విధానాన్ని చూపుతాయని అభిప్రాయపడింది. అందుకే, అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
కేసు ఏంటంటే..?
2021 నవంబరులో ఉత్తరప్రదేశ్‌లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తుండగా అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వారిని సమీపించారు. బాలికను ఇంటి దగ్గర దింపుతామని నమ్మించి బైక్‌పై ఎక్కించుకున్నారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాలికను అసభ్యంగా తాకుతూ వేధించారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్న వారు రావడంతో నిందితులు పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాదితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదైంది. ట్రయల్ కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. అయితే, వారు ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. కాగా.. ఇటీవలే ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ వక్షోజాలను తాకినంత మాత్రాన లైంగికవేధింపుల కిందకు రాదంటూ నిందితులకు అనుకూలంగా తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి సహా పలువురు జడ్జి తీర్పుని తప్పుబట్టారు. ఇదికాస్తా వివాదాస్పదంగా మారింది. దీనిపైనే, సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి కీలక వ్యాఖ్యలు చేసింది.






