ఇండోనేషియాను వణికిస్తోన్న అగ్నిపర్వతం.. 20 రోజుల్లో వెయ్యి సార్లు విస్పోటనం

by Ajay Maddhiboyina |

జనవరి 1 నుంచి 19 వరకు 1,079 సార్లు అగ్నిపర్వతం విస్పోటనం చెందినట్లు ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ధృవీకరించింది.

ఇండోనేషియాను వణికిస్తోన్న అగ్నిపర్వతం.. 20 రోజుల్లో వెయ్యి సార్లు విస్పోటనం
X

- తీవ్రత మరింత పెరిగే అవకాశం

- వేలాది మందిని తరలిస్తున్న ప్రభుత్వం

దిశ, నేషనల్ బ్యూరో:

తూర్పు ఇండోనేషియా ప్రాంతంలోని మౌంట్ ఇబు అగ్ని పర్వతం ప్రజలను వణికిస్తోంది. గత 20 రోజుల్లో ఏకంగా వెయ్యి సార్లు ఈ అగ్ని పర్వతం విస్పోటనం చెంది బూడిదను వెదజల్లింది. దీంతో ప్రభుత్వం చుట్టు పక్కల గ్రామాల్లో ఉన్న వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. రానున్న రోజుల్లో మౌంట్ ఇబు విస్పోటనాలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇండోనేషియాలోని హల్మాహేరా అనే ఓ మారుమూల ద్వీపంలో ఉన్న మౌంట్ ఇబు విస్పోటనం కారణంగా నాలుగు కిలోమీటర్ల మేర పొగ కమ్మేసింది. ఇప్పటికే సమీపంలో ఉన్న 3వేల మంది ప్రజలను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

జనవరి 1 నుంచి 19 వరకు 1,079 సార్లు అగ్నిపర్వతం విస్పోటనం చెందినట్లు ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ ధృవీకరించింది. మొదట్లో 0.3 కిలోమీటర్ల ఎత్తు వరకు దీని బూడిద ఎగిసిపడగా.. ఇప్పుడు కిలోమీటరున్నర పైగా బూడిద కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటల ప్రాంతంలో ఈ పర్వతం 17 సార్లు బద్దలైందని తెలిపారు. ఇప్పటికే చాలా మంది గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొంత మంది తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది పంట చేతికి వచ్చే సమయం కావడంతో గ్రామాలు వదిలి రావడానికి నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు తమకు అలవాటే అని అధికారులతో వాదిస్తున్నారు. గత జూన్ నుంచే మౌంట్ ఇబూ క్రియాశీలకంగా మారి నిత్యం బద్దలవుతూ ఉంది.

Next Story