‘విమానంలో బాంబ్ ఉంది’ టిష్యూ పేపర్‌పై రాత.. లక్నోలో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్

by Ramesh Naini |

ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది.

‘విమానంలో బాంబ్ ఉంది’ టిష్యూ పేపర్‌పై రాత.. లక్నోలో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఆదివారం (జనవరి 18) ఉదయం ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బాగ్‌డోగ్రా వెళ్తున్న ఇండిగో విమానం (6E-6650)లో బాంబు ఉన్నట్లు సమాచారం రావడంతో, అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

అసలేం జరిగిందంటే?

విమానం గాల్లో ఉండగా.. వెనుక వైపు ఉన్న టాయిలెట్‌లో ఒక టిష్యూ పేపర్‌పై "విమానంలో బాంబు ఉంది" అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు విషయాన్ని పైలట్లకు తెలియజేశారు. ఉదయం 8:46 గంటల సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కు సమాచారం అందించగా, 9:17 గంటలకు విమానం లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు దానిని 'ఐసోలేషన్ బే' (జనసంచారం లేని ప్రాంతం)కి తరలించారు. ఈ విమానంలో 222 మంది ప్రయాణికులు, 8 మంది శిశువులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ క్రూ కలిపి మొత్తం 237 మంది ఉన్నారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపి, బాంబ్ స్క్వాడ్ (Bomb Squad), డాగ్ స్క్వాడ్‌లతో విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు.

కార్గోలో రేడియోధార్మిక పదార్థాలు

తనిఖీల సమయంలో విమానం కార్గోలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులకు సంబంధించిన రేడియోధార్మిక పదార్థాలు (Radioactive material) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, వీటికి సంబంధించి పూర్తి అనుమతులు ఉన్నాయని, అవి సీల్డ్ ప్యాకేజింగ్‌లో భద్రంగా ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా రిఫ్రెష్‌మెంట్స్ ఏర్పాటు చేశామని, భద్రతా ప్రమాణాలకు కట్టుబడి విమానాన్ని దారి మళ్లించామని ఇండిగో సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

Next Story