భారత్ మాస్టర్‌స్ట్రోక్.. ఐఎంఎఫ్ డబ్బులు పాక్ ఎయిర్‌బేస్ రిపేర్లకే?

by Phanindra |   (  Updated:2025-05-10 14:56:30  IST  )

భారత్‌పై దాడులు చేస్తున్నపుడే పాక్‌కు ఐఎంఎఫ్ లోన్. ప్రకటన రాకముందే పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌లు పేల్చేసిన భారత దళాలు.

భారత్ మాస్టర్‌స్ట్రోక్.. ఐఎంఎఫ్ డబ్బులు పాక్ ఎయిర్‌బేస్ రిపేర్లకే?
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి పాకిస్తాన్‌కు 2.3 బిలియన్ డాలర్ల అప్పు మంజూరైంది. ఈ వార్త భారతీయుల్లో ఉక్రోషాన్ని నింపింది. పాక్ సైనిక చర్యలకు ఐఎంఎఫ్ మద్దతుగా నిలుస్తోందని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నుంచి ప్రతిఒక్కరూ ఐఎంఎఫ్‌పై మండిపడ్డారు. అందరూ ఈ ఆవేశంలో ఊగిపోతుండగానే సడెన్‌గా రెండు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇది చూసిన విశ్లేషకులు.. ఇది భారత్ మాస్టర్‌స్ట్రోక్ అంటున్నారు.

ఐఎంఎఫ్‌కు భారత్ అభ్యర్థన

పాక్‌కు అప్పు ఇవ్వొద్దని ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో భారత్ చెప్పింది. ఇప్పుడు ఆ దేశానికి రుణం ఇస్తే ఆ డబ్బుతో మరోసారి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, తమపై దాడులు చేస్తుందని వివరించింది. అలాగే ఇప్పటి వరకు పాక్ తీసుకున్న అప్పులు కూడా తిరిగి చెల్లించలేదని గుర్తుచేసింది. అయినా సరే పాక్‌కు అప్పు ఇచ్చేందుకే ఐఎంఎఫ్ మొగ్గుచూపింది. సమావేశం ముగిసిన వెంటనే పాక్ ప్రధాని కార్యాలయం నుంచి ప్రకటన రావడమే ఇందుకు నిదర్శనం.

భారత్ మాస్టర్‌స్ట్రోక్..

తెల్లారితే పాక్‌కు ఐఎంఎఫ్ నిధులు అందుతాయని తెలిసిన భారత్.. కావాలనే పాక్‌కు దిమ్మతిరిగేలా వారి ఎయిర్‌బేస్‌లపై దాడి చేసిందని విశ్లేషకులు అంటున్నారు. పాక్‌లోకి కీలకమైన రఫీకి, మురిద్, చకాలా, రహీమ్ యార్ ఖాన్, సుక్కూర్, చునియన్, పస్రూర్, సియాల్‌కోట్ మిలటరీ స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. ఆ తర్వాత కొన్ని గంటలకే పాక్‌కు అప్పు ఇస్తున్నట్లు ఐఎంఎఫ్ ధ్రువీకరించింది.

ఐఎంఎఫ్ డబ్బు ఉఫ్..

భారత దళాలు మిగిల్చిన నష్టాన్ని పూడ్చుకోవడం పాక్‌కు అంత ఈజీకాదు. మొత్తం 8 కీలక మిలటరీ స్థావరాలను పునరుద్ధరించుకొని, అక్కడి ఆర్మరీలను మళ్లీ నింపుకోవాలంటే చాలా డబ్బులు అవసరం. మురిద్ ఎయిర్‌బేస్‌లో టర్కీ నుంచి తెచ్చుకున్న బేరాక్టర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లను పాక్ దాచుకుంది. ఇప్పుడు ఇవి కూడా చాలావరకు ధ్వంసం అయ్యాయి. వీటిని మళ్లీ రీస్టాక్ చేసుకోవాలి. అలాగే భారత్ మీదకు పంపిన డ్రోన్లలో ఒక్కటి కూడా సురక్షితంగా పాక్‌కు తిరిగి వెళ్లలేదు. అన్నింటినీ భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ధ్వంసం చేసేశాయి. పాక్‌తో ఎంత సాన్నిహిత్యం ఉన్నా కూడా ఉచితంగా మిలటరీ ఆయుధాలను అందజేసేంత ఆర్థిక స్థోమత టర్కీకి లేదు. కాబట్టి మళ్లీ టర్కీ సహా ఇతర దేశాల నుంచి డ్రోన్లు, ఆయుధాలను పాక్ కొనుక్కోవాల్సిందే. దీనికితోడు ధ్వంసమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాలి.

ఇవే కారణాలను చూపిస్తున్న విశ్లేషకులు.. భారత్ కనుక పాక్ ఎయిర్‌బేస్‌లను టార్గెట్ చెయ్యడంలో ఆలస్యం చేసి ఉంటే ఐఎంఎఫ్ నిధులను ఆ దేశం మళ్లీ ఉగ్రవాదానికే ఖర్చుపెట్టి ఉండేదని అంటున్నారు. సరైన సమయంలో భారత్ దాడి చెయ్యడంతో పాక్‌కు వచ్చే నిధులన్నీ మిలటరీ ఖర్చులకే సరిపోతాయని, ఇది కచ్చితంగా భారత్ మాస్టర్‌స్ట్రోక్ అని మెచ్చుకుంటున్నారు.

Next Story