India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరడంపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు

by S Gopi |

'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి.

India: ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడంపై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో శాశ్వత శాంతిని నెలకొల్పడం, అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించే లక్ష్యంతో 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆహ్వానాన్ని భారత్ ఇంకా అంగీకరించలేదని ప్రభుత్వ వర్గాలు బుధవారం తెలిపాయి. యుద్ధాలతో దెబ్బతిన్న గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశ సందర్భంగా ప్రతిపాదించిన ఈ బోర్డులో చేరాలని అమెరికా అధ్యక్షుడు ఆహ్వానించిన అనేక మంది గ్లోబల్ లీడర్లలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇందులో ఉన్న సమస్యలు చాలా సున్నితమైనవి కాబట్టి భారత్ ఆహ్వానం గురించి జాగ్రత్తగా వ్యవహరిస్తోందని, వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, ట్రంప్ గురువారం దావోస్‌లో జరుగుతున్న వార్షిక ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్) కార్యక్రమంలో 'బోర్డ్ ఆఫ్ పీస్' గురించి, దాని ప్రణాళికలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అర్జెంటీనా, ఈజిప్ట్, పాకిస్తాన్, యూఏఈ, వియత్నాం వంటి కొన్ని దేశాలు ఈ ఆహ్వానాన్ని అంగీకరించగా, చైనా, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్ వంటి మరికొన్ని దేశాలు ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

గాజా వంటి ఘర్షణ ఉన్న ప్రాంతాలలో శాంతి, స్థిరత్వం, సరైన పాలనను తీసుకురావడానికి 'బోర్డ్ ఆఫ్ పీస్' పనిచేస్తుందని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ కొత్త సంస్థ ఐక్యరాజ్యసమితి పాత్రను సవాలు చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, ఈ బోర్డు గాజా సరైన దారిలో నడిపేందుకు, సంవత్సరాల తరబడి పోరాటం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న ఆ ప్రాంత పునర్నిర్మాణం కోసం నిధులను సమన్వయం చేయడానికి సహాయపడుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ బోర్డు పనిని నిర్వహించడానికి ట్రంప్ ప్రభుత్వం ఒక కార్యనిర్వాహక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ బృందంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మాజీ యూకే ప్రధాన మంత్రి టోనీ బ్లెయిర్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఉన్నారు. ట్రంప్ 20-పాయింట్ల ప్రణాళికకు బోర్డు మద్దతు ఇస్తుంది. ఇందులో గాజాను ఉగ్రవాద రహితంగా మార్చడం, అక్కడి ప్రజలు శాంతి, భద్రతతో జీవించగలిగేలా దాన్ని తిరిగి అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.

Next Story