యూఎస్‌లో భారీ డీల్ చేసుకున్నా భారత్ ఫెయిల్.. కానీ పాక్ సక్సెస్..!

by Phanindra |

యూఎస్‌ సుంకాల విషయంలో భారత్ ఫెయిలవగా.. పాక్ సక్సెస్ అయింది. లాబీయింగ్ కోసం ఈ రెండు దేశాలూ చేసుకున్న డీల్స్ ఎలా ఉన్నాయంటే?

యూఎస్‌లో భారీ డీల్ చేసుకున్నా భారత్ ఫెయిల్.. కానీ పాక్ సక్సెస్..!
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా విషయంలో భారత్ తప్పటడుగు వేసిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. యూఎస్‌లో లాబీయింగ్ విషయంలో భారత్ కన్నా పాకిస్తాన్ తెలివిగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాలపై యూఎస్ వేసిన సుంకాలే దీనికి నిదర్శనం. అదనపు సుంకాలతో కలిపి భారత్‌పై వేసిన టారిఫ్‌లు 50 శాతానికి చేరాయి. అదే సమయంలో పాకిస్తాన్‌పై యూఎస్ కేవలం 19 శాతం సుంకాలు మాత్రమే వేస్తోంది. ఇదొక్కటే కాదు.. ఇటీవల జరుగుతున్న పలు అంశాలు పరిశీలిస్తే యూఎస్‌కు పాక్ దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ఇక్కడే లాబీయింగ్ పనిచేసేది.

భారీ డీల్‌తో భారత్‌కు నిరాశే

ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తమ దేశం తరఫున లాబీయింగ్ చేసేందుకు ఎన్నో దేశాలు ట్రంప్ సన్నిహితులకు సంబంధించిన సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. భారత్ కూడా ట్రంప్ మాజీ సలహాదారు జేసన్ మిల్లర్‌కు చెందిన ఎస్‌హెచ్‌డబ్ల్యూ పార్టనర్స్‌తో ఏడాదికి 1.8 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2016, 2020, 2024 ఎన్నికల్లో ట్రంప్ ప్రచారంలో జేసన్ కీలక పాత్ర పోషించాడు. ట్రంప్‌తో జేసన్‌కు మంచి స్నేహం ఉండటంతో తమ తరఫున లాబీయింగ్ చేసేందుకు ఉపయోగపడతానడి భారత్ భావించింది.

50 వేల డాలర్లతో పాక్‌కు రిజల్ట్స్

మన దాయాది పాకిస్తాన్ కూడా భారత్ బాటలోనే నడిచింది. అయితే అంత ధర చెల్లించలేక.. ట్రంప్ మాజీ బాడీగార్డ్ కీత్ షిల్లర్‌కు చెందిన జావెలిన్ అసోసియేట్స్‌తో నెలకు 50 వేల డాలర్లు చెల్లించేలా డీల్ చేసుకుంది. రెండు దశాబ్దాలుగా ట్రంప్‌తో కీత్‌కు సాన్నిహిత్యం ఉండటం గమనార్హం. ప్రస్తుతం యూఎస్‌తో బంధాలను గమనిస్తే లాబీయింగ్ విషయంలో భారత్ తప్పటడుగు వేసినట్లే కనిపిస్తోంది. అదే సమయంలో తక్కువ ధర చెల్లిస్తూనే పాక్ చాలా విషయాల్లో పైచేయి సాధించిందని చెప్పాలి.

ట్రంప్ ఈగోకు దెబ్బ?

కానీ ప్రస్తుత పరిస్థితులను లాబీయింగ్‌కు మాత్రమే పరిమితం చేయొద్దని నిపుణులు అంటున్నారు. ట్రంప్ స్వభావం కూడా దీంట్లో కీలక పాత్ర పోషిస్తుందని వాళ్ల ఆలోచన. ట్రంప్ ఏ విషయమైనా నేరుగా డీల్ చేసేందుకే ఇష్టపడతారని, ఆసిమ్ మునీర్ నేరుగా ఆయన్ను కలిశారని గుర్తుచేస్తున్నారు. అదే సమయంలో ఓవల్ ఆఫీసుకు రావాలని మోడీని ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు. అలాగే ట్రేడ్ డీల్ విషయాలు కూడా నేరుగా ఫోన్‌లో మాట్లాడటం ట్రంప్ పద్ధతి. ఇలాంటి అంశాలన్నింటినీ నెగోషియన్ బృందానికి వదిలేయడం మోడీ స్టయిల్. ఇవన్నీ ట్రంప్ ఈగోని హర్ట్ చేసి ఉండొచ్చని, అందుకే పాక్‌కు ఆయన దగ్గరవుతున్నారనే వాదన కూడా ఉంది.

కలిసినా ఫలితాలు డౌటే

అయితే ట్రంప్‌ను నేరుగా కలిసినా అన్నీ అనుకున్నట్లు జరగకపోవచ్చు. ఉదాహరణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నేరుగా ట్రంప్, జేడీ వాన్స్‌ను కలిసినా.. లైవ్‌లో అవమానాలు ఎదుర్కున్నారే తప్ప ఫలితం కనిపించలేదు. సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ కరిన్ కెల్లర్ సట్టర్ నేరుగా వాషింగ్టన్ వచ్చినా ఆమెను ట్రంప్ సహా ఏ నేతా కలవలేదు. వాణిజ్యంపై ఎలాంటి అధికారం లేని సెక్రటరీ ఆఫ్ స్టేట్‌ను కలిసి వెనుతిరగాల్సి వచ్చింది. అయితే మెక్సికోకు చెందిన క్లాడియా షీన్‌బామ్, వియత్నాంకు చెందిన లో టామ్ నేరుగా ట్రంప్‌కు కాల్ చేసి మాట్లాడి కొంత ఉపశమనం పొందారు.

అంటే ట్రంప్‌ను నేరుగా కలిసినా ఫలితాలు ఎలా వస్తాయని చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలోనే లాబీయింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాదిలోనే సుమారు 30 దేశాలు యూఎస్‌లో లాబీయింగ్ చేసేందుకు కొత్త సంస్థలు, వ్యక్తులతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో షిల్లర్ టీంతో కలిసి పాకిస్తాన్ తమపై సుంకాలు తగ్గించుకోగలిగింది. కానీ భారీ ఒప్పందం చేసుకున్నా సరే మిల్లర్ మాత్రం ఈ విషయంలో భారత్‌కు ఉపశమనం అందించలేకపోవడం గమనార్హం.

Next Story