ఆకలి సూచీలో అట్టడుగుకు భారత్.. కేంద్రం గొప్పలు కాగితాలకే పరిమితమా?

by Disha Web Desk 4 |
ఆకలి సూచీలో అట్టడుగుకు భారత్.. కేంద్రం గొప్పలు కాగితాలకే పరిమితమా?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు దశాబ్దాల క్రితం తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్న భారత్, అమెరికా నుంచి పబ్లిక్ లా 480 (పీఎల్ 480) పథకం కింద ఆహారధాన్యాలను దిగుమతి చేసుకుంది. అయితే రాజకీయ కారణాలతో అమెరికా ఆహార ధాన్యాల సరఫరాను సస్పెండ్ చేసినప్పుడు ఆహార ఉత్పత్తిలో స్వావలంబనను భారత్ లక్ష్యంగా చేసుకుంది. అధిక దిగుబడి వంగడాలను రూపొందించి అచిరకాలంలోనే తన లక్ష్యాన్ని సాధించింది. ఈ క్రమంలో ప్రపంచంలో అతిపెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తిదారుల్లో ఒకటిగా భారత్ అవతరించింది. గోధుమలు, వరి, తదితర పంటల్లో స్వావలంబన సాధించింది. ప్రపంచ వాణిజ్య సంస్థ అనుమతిస్తే యావత్ ప్రపంచానికి ఆహార ధాన్యాలను భారత్ ఎగుమతి చేయగలదని ప్రధాని నరేంద్రమోదీ చేసిన తాజా ప్రకటనను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాల్సి ఉంది.

హైబ్రిడ్ వంగడాల ప్రభావంతో ఆహార పంటల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన సాధించినప్పటికీ, గ్రామీణ భారత్ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుస్థితిని ఇది కప్పిపుచ్చలేదు. మన రైతులు పోటీపడి ఆహార ధాన్యాల ఉత్పత్తిని ఏటా పెంచుతున్నప్పటికీ, ఆహార పదార్థాల నిల్వలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో గుట్టలుగా పేరుకుపోతున్నప్పటికీ, కోట్లాదిమంది రైతుల దారిద్య్రం ఎందుకు ఇప్పటికీ తగ్గడం లేదన్నది ప్రశ్న. ప్రపంచ క్షుద్బాధా సూచిలో మన దేశం ప్రతిఏటా ఎందుకు అట్టడుగుకు దిగజారిపోతోందన్నది మరో ప్రశ్న. కోట్లాదిమంది మహిళలు, పిల్లలు మన దేశంలో నేటికీ పోషకాహార లేమితో ఎందుకు కృశించిపోతున్నారన్నది మరో ప్రశ్న. 2021 ప్రపంచ ఆకలి సూచిలో మన స్థానం మరింతగా దిగజారిపోవడం చూస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, నిల్వల్లో మనం సాధించిన అభివృద్ధి అంతా డొల్లే అనిపించకమానదు. దేశంలో ఇంత అస్తవ్యస్థ పరిస్థితులు కొనసాగుతుండగా ప్రపంచానికే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తామని ప్రధాని ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ప్రపంచం సరికొత్త సమస్యను ఎదుర్కొంటోందని, ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల నిల్వలు ఖాళీ ఆవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్ భేటీ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పెట్రోలు, చమురు, ఎరువులతోపాటు నిత్యావసరాలకు కూడా కొరత ఏర్పడబోతోందని, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పుకుంటే ప్రపంచం మొత్తానికి ఆహార ధాన్యాలు సరఫరా చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ చెప్పారు. దేశ ప్రజలకు అవసరమైనంత ఆహారం రెడీగా ఉందని, కాని మన రైతులు ఇప్పుడు ప్రపంచానికి తిండిపెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని మోదీ చెప్పారు. ప్రధాని ప్రకటన వెనుక ఉన్న వాస్తవాలను పరిశీలిద్దాం.

అమెరికాకు, భారతదేశానికి ఒక విషయంలో వ్యత్యాసం ఉందని చెప్పాలి. అమెరికా మొదట తన జనాభాకు ఆహారం అందుబాటులో ఉంచి తర్వాత మిగులు ధాన్యాలను ఎగుమతి చేస్తోంది. కానీ భారతదేశానికి అలాంటి విధానమే లేదు. గత కొన్నేళ్లుగా తాను సాధించిన వ్యవసాయ రంగ విజయాన్ని భారత ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. 2006-07 సంవత్సరంలో మన రైతులు 217 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను పండించగా, 2016-17 నాటికి అది 275.11 మిలియన్ టన్నులకు పెరిగింది. చివరకు 2009, 2014, 2015 సంవత్సరాల్లో దేశం కరువు బారిన పడినప్పటికీ వ్యవసాయ ఉత్పత్తి మాత్రం తగ్గలేదు. అందుకే దేశం స్వావలంబనను మాత్రమే కాకుండా ఎగుమతి చేయడానికి తగినంత వ్యవసాయ ఉత్పత్తులను కూడా చేయగలుగుతోందని కేంద్రం ప్రభుత్వం ఘనంగా చెబుతోంది.

కానీ కేంద్రం చెబుతున్న దానికి, వాస్తవంగా గ్రామీణ భారత్‌లో జరుగుతున్న పరిణామాలకు పొంతనే కుదరటం లేదు. గత ఏడేళ్లలోనే అత్యధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు నమోదయ్యాయి. గత రెండు దశాబ్దాల్లో మునుపెన్నడూ లేనంత అధిక సంఖ్యలో రైతుల నిరసనలు జరుగుతూ వచ్చాయి. 1991 నుంచి 2011 వరకు కోటీ 40 లక్షలమంది రైతులు ఆర్థిక నష్టాలు తట్టుకోలేక వ్యవసాయ రంగాన్ని వదిలేశారు.

ఆహార ఎగుమతులే కాదు ఆకలీ పెరిగింది

ఆహార ధాన్యాల ఎగుమతిదారుగా భారత్ అవతరించిందని కేంద్ర ప్రభుత్వం గొప్పలు పోతున్నప్పటికీ, దేశంలో నేటికీ 27 కోట్లమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఆహార ధాన్యాల అందుబాటుకు సంబంధించి ఆక్స్‌ఫామ్ సూచిలో భారత్ 97వ స్థానంలో నిలబడగా. ప్రపంచ ఆకలి సూచిలో 2020లో 94వ స్థానంలో ఉన్న భారత్ 2021 నాటికి మరింతగా దిగజారిపోయింది. తాను పండించిన ఆహార పంటలను దేశీయ అవసరాలకు తగినంతగా ఉపయోగించినప్పుడే ఏ దేశాన్నైనా స్వావలంబన సాధించిన దేశంగా చెప్పవచ్చు. కానీ పై గణాంకాలను చూస్తే నిజంగానే మనం స్వావలంబన సాధించామా అనేది ప్రశ్నార్థకమవుతుంది. దేశంలోని పలుప్రాంతాలు ఇప్పటికీ తగినంతగా వరి, గోధుమ, తృణధాన్యాల కొరతతో ఉంటున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అందుకే దేశంలో ఆకలిగొన్న ప్రజలందరికీ ముందుగా తిండి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంటే, అప్పుడు ఆహార ధాన్యాల ఎగుమతి దేశంగా ప్రభుత్వం ఊదర గొట్టుకుంటున్న ప్రచారం డొల్ల అని అర్థమవుతుందని ప్రముఖ వ్యవసాయరంగ నిపుణుడు దేవీందర్ శర్మ పదేపదే చెబుతున్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికీ అందుతున్న ఆహారం పలు దశాబ్దాలుగా ప్రతిష్టంభనకు గురవుతూ వస్తోందని ఆయన అభిప్రాయం.

ఆకలి కేకల మధ్యే ఎగుమతులు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 2015-16 సంవత్సరాల్లో 20.4 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఎగుమతి చేసిన భారత్ 2017-18లో 22.3 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. అదే సమయంలో మన వ్యవసాయ దిగుమతులు కూడా తక్కువేమీ కావు. 2015-16లో 8.1 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలను, 2017-18లో 9.4 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలను దేశం దిగుమతి చేసుకుంది. పైగా 2015-16లో మనం దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల్లో ఆహార ధాన్యాల వాటా 79 శాతం. ఆ తదుపరి సంవత్సరం కూడా 78 శాతంగా ఇది నమోదైంది. ఒకవైపు ఆహార పదార్థాల స్వావలంబన, మరోవైపు ఆహార ధాన్యాల మిగులు దేశంగా మారుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ పంపిణీ విధానంలో లోపాల కారణంగా దేశవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లేమి కొట్టొచ్చినట్లుగా కనబడుతోంది. అందుకే మనం ఆకలి సమస్యను, పోషకాహార లేమి సమస్యను, సమాన పంపిణీలో అవకతవకలను పరిష్కరించనంత కాలం ఆహార ధాన్యాల మిగులు దేశంగా చెప్పుకోలేం. పైగా ఇవి ఇలాగే కొనసాగితే మరిన్ని వ్యవసాయ దిగుమతులను చేసుకునే దేశంగా మనం దిగజారిపోతామని స్పష్టమవుతుంది.

భారతదేశంలో ఆకలి సంక్షోభం ఏ స్థాయిలో ఉందో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తాజా నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈ సూచిలోని మొత్తం 116 దేశాల్లో 2021 నాటికి భారత్ 101వ స్థానంలో ఉంది. 2020లో మన ర్యాంకు 94 కాగా.. సంవత్సర కాలంలోనే మరీ అధమస్థాయికి పడిపోయామన్నమాట. భారత ప్రభుత్వం ప్రపంచ ఆకలి సూచీ తాజా గణాంకాలను చూసి షాక్ తిన్నట్లు చెప్పుకుంది. క్షేత్రవాస్తవం నుంచి దూరం తొలిగిన సూచీగా అభివర్ణిస్తూ కొట్టిపడేసింది. కానీ 116 దేశాల్లో ఆకలి సూచీ విషయంలో మనం 101వ స్థానంలో ఉన్న వాస్తవాన్ని చూస్తే 2030 నాటికి ఆకలి అనేదే లేని దేశం గుర్తింపును భారత్ సాధించగలదా అనేది పెద్ద ప్రశ్న. గ్లోబల్ హంగర్ సూచి ప్రకారం భారత్ తన స్థానాన్ని సంవత్సరం లోపే 94 నుంచి 101కి దిగజార్చుకోగా, మన పొరుగున ఉన్న పాకిస్తాన్ (92), నేపాల్ (76), బంగ్లాదేశ్ (76) స్థానాలతో మనకంటే మెరుగ్గా ఉంటడం గమనార్హం. ఆప్ఘనిస్తాన్, నైజీరియా, సియర్రా లియోన్, యెమెన్, సోమాలియా వంటి 15 దేశాలు మాత్రమే మనకంటే కింది స్థాయిలో ఉండటం గమనార్హం.

పోషకవిలువలు లేని దేశం

ఆకలి సూచి లెక్కలను చూస్తే దేశంలో ఆకలి స్థాయి ఇప్పటికీ తీవ్రంగానే ఉందని స్పష్టమవుతుంది. ఆకలి, పోషకాహార లేమి, శిశుమరణాలు, పిల్లల బరువు, ఎత్తు వంటి అనేక అంశాల్లో భారత్ ప్రమాణాలు నాసిరంకగానే ఉన్నాయని చెబుతున్న గణాంకాలు మన దేశ వాస్తవ సత్తాను చూపిస్తున్నాయి. జనాభాలోని చాలామంది నేరుగా ఆకలి బాధలకు దూరంగా ఉండవచ్చు కానీ దేశ ప్రజల్లో మెజారిటీకి అందుతున్న ఆహారంలో పోషక విలువలు చాలా తక్కువని ప్రజారోగ్య సంరక్షకులు తేల్చి చెబుతున్నారు. కేవలం వరి అన్నంతోనే భోజనం ముగిస్తున్న వారిలో అనేకమంది పోషకవిలువల పరమైన లేమితో ఇబ్బంది పడుతున్నారని వీరి అభిప్రాయం. 6 నుంటి 23 సంవత్సరాల లోపు వయసున్న పిల్లల్లో కేవలం 10 శాతం మందికి మాత్రమే తగినన్ని పోషక విలువలు కలిగిన ఆహారం లభిస్తోందని కేంద్ర ప్రభుత్వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా డేటా చెబుతోంది. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 35.8 శాతంమంది తక్కువ బరువుతో ఉన్నారనే వాస్తవం కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంటున్న క్షేత్ర వాస్తవానికి దూరంగా ఉందా, దగ్గరగా ఉందా అనేది ప్రశ్న.

ఆకలి తీర్చలేని దేశం, పోషక విలువలు అందించలేని దేశం. రైతుల మరణాలను తప్పించలేని దేశం ప్రపంచ ఆహార సరఫరా దేశంగా తన్ను తాను ఎలా ప్రకటించుకోగలదనేది అన్నిటికంటే పెద్ద ప్రశ్న.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed