Donald Trump: చరిత్రలో తొలిసారి అమెరికా అధ్యక్షుడిని పిలవని ఎన్ఏఏసీపీ

by S Gopi |

రిపబ్లికన్ అధ్యక్షుడు తమ సంస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.

Donald Trump: చరిత్రలో తొలిసారి అమెరికా అధ్యక్షుడిని పిలవని ఎన్ఏఏసీపీ
X

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే నెలలో జరిగే వార్షిక సమావేశానికి డోనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించబోమని పౌర హక్కుల సంస్థ ఎన్ఏఏసీపీ ఓ ప్రకటనలో తెలిపింది. 116 ఏళ్లుగా పనిచేస్తున్న ఎన్ఏఏసీపీ తన సమావేశానికి హాజరు కావాలని అమెరికా అధ్యక్షుడిని అడగకపోవడం ఇదే మొదటిసారి. ఆఫ్రికన్ అమెరికన్లకు న్యాయం అందించడానికి ఏర్పడిన అమెరికన్ పౌర హక్కుల సంస్థే నేషనల్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ కలర్డ్ పీపుల్(ఎన్ఏఏసీపీ). ఈ సంస్థ అధ్యక్షుడు డెరిక్ జాన్సన్ ట్రంప్‌ను ఆహ్వానించకపోవడంపై స్పందిస్తూ, రిపబ్లికన్ అధ్యక్షుడు తమ సంస్థకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఈ నిర్ణయంపై రాజకీయ పార్టీతో ఎటువంటి సంబంధం లేదు. మా లక్ష్యం పౌర హక్కులను ముందుకు తీసుకెళ్లడం. కానీ ప్రస్తుత అధ్యక్షుడు పౌర హక్కులను తొలగించడమే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. ట్రంప్ అధికారాన్ని కేంద్రీకృతం చేయడానికి ప్రయత్నించడం ద్వారా అమెరికన్ ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని, సమాఖ్య పౌర హక్కుల రక్షణను అణచివేసే, రద్దు చేసే రాజ్యాంగ విరుద్ధమైన ఉత్తర్వులపై సంతకం చేశారని, యూఎస్ సైన్యాన్ని కమ్యూనిటీలకు వ్యతిరేకంగా మార్చారని జాన్సన్ విమర్శించారు.

జేడీ వాన్స్‌కు కూడా నో-ఇన్విటేషన్

1946లో డెమొక్రాట్ అధ్యక్షుడు హ్యారీ ట్రూమాన్ ఈ సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నిష్పక్షపాతంగా రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీల నుంచి అధ్యక్షులను ఆహ్వానిస్తున్నారు. కానీ ప్రస్తుతం, డోనాల్డ్ ట్రంప్ ప్రజాస్వామ్యం, పౌర హక్కులపై దాడి చేస్తున్నారు. ట్రంప్ అమెరికా రాజ్యాంగం కంటే ఫాసిస్ట్ ప్లేబుక్‌నే ఎక్కువగా నమ్ముతారు. ఈ ప్లేబుక్ రాడికల్, అమెరికన్‌కు విరుద్ధమని జాన్సన్ అన్నారు. కాగా, జూలై 12-16 తేదీలలో నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరిగే జాతీయ సమావేశానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా ఆహ్వానించబోమని ఎన్ఏఏసీపీ తెలిపింది. భిన్నత్వం, సమానత్వం, కార్యక్రమాలు, ఓటింగ్ హక్కులకు సంబంధించి ట్రంప్ పాలనపై పౌర హక్కుల సంఘం అనేక వ్యాజ్యాలు దాఖలు చేసింది.

Next Story