గ్రహణం ఎఫెక్ట్: ప్రాక్టీస్ ఆపేసిన భారత జట్టు.. మేనేజ్‌మెంట్ వివరణ ఇదే!

by Gantepaka Srikanth |

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు ముందు టీమ్ ఇండియా తన వ్యూహాలకు పదును పెడుతోంది.

గ్రహణం ఎఫెక్ట్: ప్రాక్టీస్ ఆపేసిన భారత జట్టు.. మేనేజ్‌మెంట్ వివరణ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న హై-వోల్టేజ్ సెమీఫైనల్ పోరుకు ముందు టీమ్ ఇండియా తన వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే, మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన భారత జట్టు శిక్షణ(Team India Practice) షెడ్యూల్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. చంద్రగ్రహణం కారణంగా ప్రాక్టీస్ సెషన్‌ను మేనేజ్‌మెంట్ కొంతకాలం వాయిదా వేసింది.

ఆధ్యాత్మిక కారణాలతో ఆలస్యం

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 3న సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు టీమ్ ఇండియా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కానీ, ఆ సమయంలో చంద్రగ్రహణం ఉండటంతో భారత మేనేజ్‌మెంట్ అప్రమత్తమైంది. గ్రహణ సమయంలో శుభకార్యాలు లేదా ముఖ్యమైన పనులు ప్రారంభించడం అరిష్టమన్న నమ్మకంతో, కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం శిక్షణను ఒక గంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించింది. "సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు అంతా శుభం జరగాలని జట్టు కోరుకుంటోంది. చంద్రగ్రహణం సమయంలో ప్రాక్టీస్ చేయడం మంచిది కాదని భావించి, పాజిటివ్ నోట్‌తో సెషన్‌ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేశాం" అని జట్టు వర్గాలు వెల్లడించాయి.

వరుసగా మూడోసారి ఇంగ్లాండ్‌తో తలపడనున్న భారత్

ఈ మెగా టోర్నీలో భారత్ అద్భుత ప్రదర్శనతో సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఒక్క ఓటమి మినహా, భారత్ తిరుగులేని ఆటతీరును ప్రదర్శించింది. ముఖ్యంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సంజు శాంసన్ (97 నాటౌట్) వీరోచిత పోరాటంతో భారత్ విజయం సాధించింది. మరోవైపు, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా సెమీస్‌కు చేరింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో తలపడటం ఇది వరుసగా మూడవసారి కావడం గమనార్హం.

Next Story