- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన జ్ఞానాన్ని దహనం చేయడానికి ఖిల్జీ నిప్పును వాడితే.. బ్రిటిష్ వారు సిలబస్‌ను వాడారు: గౌతమ్ అదానీ
భారత ప్రజల జ్ఞానాన్ని దహనం చేయడానికి ఖిల్జీ నిప్పును వాడితే.. బ్రిటిష్ వారు సిలబస్‌ను వాడారని గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రజల జ్ఞానాన్ని దహనం చేయడానికి ఖిల్జీ నిప్పును వాడితే.. బ్రిటిష్ వారు సిలబస్‌ను వాడారని గౌతమ్ అదానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani) భారత చరిత్ర, భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. "మన చరిత్ర మనకు అద్దంలాంటిది. మన గుర్తింపును మనం గుర్తించడంలో విఫలమైనప్పుడల్లా, ఇతరులు జోక్యం చేసుకుని మన విధిని నిర్వచించారు. సార్వభౌమత్వ పోరాటంలో గెలిస్తేనే విధి దక్కుతుంది," అని ఆయన అన్నారు. ఇక్కడకు వంద కి.మీ. దూరంలో ఉన్న నలంద ఒకప్పుడు భారతదేశపు అద్భుతమైన విద్యాపీఠమని, అది మన నాగరికతకు గుర్తింపు అని ఆయన గుర్తు చేశారు. భక్తియార్ ఖిల్జీ నలందను తగలబెట్టినప్పుడు, అతని లక్ష్యం కేవలం కట్టడాలను నాశనం చేయడం కాదు, మన నాగరిక విశ్వాసాన్ని, విదేశీ ప్రభావం లేకుండా స్వతంత్రంగా ఆలోచించే మన సామర్థ్యాన్ని నాశనం చేయడమేనని అదానీ వ్యాఖ్యానించారు.
ఖిల్జీ నిప్పును ఉపయోగించగా, బ్రిటిష్ వారు కరికులం (పాఠ్య ప్రణాళిక) ఉపయోగించి, ఆలోచనాపరులను కాకుండా గుమాస్తాలను తయారు చేసే విద్యా వ్యవస్థను రూపొందించారని ఈ సందర్భంగా గౌతమ్ అదానీ విమర్శించారు. "మన కథలను మనం మరచిపోయిన రోజు, మన ఐక్యత విచ్ఛిన్నం కావడం మొదలవుతుందని గౌతమ్ అదానీ హెచ్చరించారు. ప్రపంచంలో ఏ భౌగోళిక రాజకీయ కూటమి కూడా స్వచ్ఛమైనది కాదని, ప్రతి కూటమి షరతులతో కూడినదని, లావాదేవీల రూపంలో ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అధికారం ముందుగా నియంత్రించేది 'కథనాని' (Narrative) అని పేర్కొన్నారు. చివరగా యువతను ఉద్దేశించి.."చరిత్రను మర్చిపోవద్దు, భవిష్యత్తును అప్పగించరు, దానిని సంపాదించాలి. మీరు నిర్మించేదే దేశ దిశను నిర్ణయిస్తుంది, మీరు ఏమవుతారో అదే మన భారతదేశం అవుతుంది. అంటూ ఆయన తమ ప్రసంగాన్ని ముగించారు.
- Tags
- Gautam Adani






