IED blast: ఒడిశా, జార్ఖండ్ సరిహద్దుల్లో కూంబింగ్.. ఐఈడీ పేలుడులో జవాన్ మృతి

by B.Srinivas |

ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా జరిగిన పేలుడులో సీఆర్‌పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు.

IED blast: ఒడిశా, జార్ఖండ్ సరిహద్దుల్లో కూంబింగ్.. ఐఈడీ పేలుడులో జవాన్ మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా జార్ఖండ్ సరిహద్దుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా జరిగిన పేలుడులో ఒక సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్(CRPF) జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశాలోని రూర్కెలా సమీపంలో ఉన్న బాలంగ్ ప్రాంతంలో శనివారం ఉదయం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా ఐఈడీ పేలినట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్ 134వ బెటాలియన్‌కు చెందిన ఏఎస్ఐ సత్యవాన్ కుమార్ సింగ్ (34)కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను రూర్కెలాలోని అపోలో ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనను ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సత్యవాన్ కుటుంబానికి అండగా ఉంటామని సీఆర్‌పీఎఫ్ తెలిపింది.

కాగా, ఒడిశాలోని సుందర్ గఢ్ (Sunderghad) జిల్లాలోని ఓ రాతి క్వారీ సమీపంలో మావోయిస్టులు దోచుకున్న పేలుడు పదార్థాల కోసం భద్రతా బలగాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐఈడీ పేలుడు ఘటన జరిగింది. తాజా ఘటన తర్వాత మొత్తం ప్రాంతాన్ని హై అలర్ట్‌లో ఉంచారు. మావోయిస్ట్ ఆపరేషన్‌ను బలోపేతం చేయడానికి ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్టు తెలుస్తోంది.

Next Story