ఎయిర్‌‘ఫోర్స్’ తగ్గుతోంది..దాదాపుగా పాక్‌తో సమానం!

by Phanindra |

భారత వాయుసేన ఎయిర్‌ ఫోర్స్ తగ్గుతోంది. మరికొన్ని రోజుల్లో మన ఎయిర్ స్క్వాడ్రన్ల సంఖ్య దాదాపుగా పాక్‌తో సమానం అయ్యేలా ఉంది.

ఎయిర్‌‘ఫోర్స్’ తగ్గుతోంది..దాదాపుగా పాక్‌తో సమానం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన భారత వాయుసేన.. ఇప్పుడు ఒక పెద్ద కష్టం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్) వద్ద ఉన్న స్క్వాడ్రన్ల సంఖ్య దాదాపుగా పాకిస్తాన్‌తో సమం అవుతుంది. ఇంతకాలం పాక్‌ కన్నా ఎక్కువ ఎయిర్ స్క్వాడ్రన్‌లు ఉన్న భారత్.. ఇప్పుడు దాయాదితో సమం అయితే పలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఐఏఎఫ్‌లో ఉన్న చివరి రెండు మిగ్21 స్క్వాడ్రన్లను తొలగించాలని ఇటీవలే వాయుసేన నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ వద్ద ఉన్న స్క్వాడ్రన్ల సంఖ్య 29కు చేరుకోనుంది. పాక్ వద్ద మొత్తం 25 ఎయిర్ స్క్వాడ్రన్లు ఉండగా.. చైనా వద్ద ఏకంగా 66 స్క్వాడ్రన్లు ఉండటం గమనార్హం.

మోడ్రన్ వార్‌ఫేర్‌లో ఎయిర్ సుపీరియారిటీ చాలా ముఖ్యం. గగనతలంలో పైచేయి సాధించాలంటే ఫైటర్ జెట్లు చాలా ముఖ్యం. అందుకే ఎయిర్ స్క్వాడ్రన్లు కీలకమని నిపుణులు అంటున్నారు. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 నుంచి 20 జెట్ విమానాలుంటాయి. ఇప్పుడు మిగ్ స్క్వాడ్రన్లను తొలగించేస్తే భారత వాయుసేన వద్ద ఉండే ఫైటర్ జెట్ల సంఖ్య సుమారు 522కు చేరుతుంది. పాకిస్తాన్ వద్ద 450 ఫైటర్ జెట్లు ఉండగా.. చైనా వద్ద ఏకంగా 1200 జెట్స్ ఉన్నాయి. ఇలా చూసుకుంటే అక్టోబర్ నుంచి గగనతలంలో భారత్ పైచేయి కోల్పోతుందనే చెప్పాలి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రతి ఏటా కనీసం 40 ఫైటర్ జెట్లను వాయుసేనకు అందించాలని ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతం ఇది అసాధ్యమని నిపుణులు అంటున్నారు.

ఎన్నో సమస్యలు..

ఫైటర్ జెట్ల సంఖ్యను పెంచడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. 126 మీడియం మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంఎంఆర్‌సీఏ)ల కోసం చేసుకున్న డీల్‌ను 2015లో భారత్ రద్దుచేసుకుంది. ఆ తర్వాత ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలు తెచ్చుకుంది. కానీ ఎక్కువగా పాత విమానాలపై ఆధారపడుతున్న వాయుసేన అవసరాలను తీర్చడంలో ఈ డీల్ పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. ఆ తర్వాత మరో 26 రఫేల్స్ కోసం ఆర్డర్ ఇచ్చినా.. ఇవి నేవీ కోసం తీసుకుంటున్నవి, వాయుసేన కోసం కాదు. ఈ క్రమంలోనే 114 మల్టీరోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కొనాలని భారత్ అనుకుంటున్నా.. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

‘మేడ్ ఇన్ ఇండియా’ కూడా లేట్..

‘మేడ్ ఇన్ ఇండియా’ జెట్లతో స్వదేశీ పరిజ్ఞానంపై ఆధారపడాలని అనుకున్న వాయుసేనకు ఇక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పాలి. హాల్ నుంచి 83 తేజాస్ మార్క్-1ఏ విమానాలు ఆర్డర్ ఇవ్వగా.. వీటి డెలివరీ పలు సమస్యలతో మారుతూ వస్తోంది. హాల్ నుంచి 97 తేజాస్ మార్క్-1ఏ జెట్స్, 108 అప్‌గ్రేడెడ్ తేజాస్ మార్క్-2 విమానాలను కొనుగోలు చేయాలని వాయుసేన అనుకుంటోంది. కానీ ఇప్పుడప్పుడే ఈ డీల్ జరిగేలా కనిపించడం లేదు. ఇదే సమయంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయాలనుకున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఆమ్కా) కూడా ప్రస్తుతానికి కేవలం ఐడియాగానే ఉంది. ఇది ఒక రూపం దాల్చడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్న వాయుసేన.. మళ్లీ బలంగా నిలబడాలంటే చాలా ఏళ్లు పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story