రోడ్డు ప్రమాద ప్రాణదాతలకు భారీ నజరానాలు

by Muthe.Rajitha |

ప్రస్తుత రోజుల్లో రోడ్డు మీద ఎంత పెద్ద ప్రమాదం జరిగినా చూసి చూడనట్టు పోతున్నారు.

రోడ్డు ప్రమాద ప్రాణదాతలకు భారీ నజరానాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుత రోజుల్లో రోడ్డు మీద ఎంత పెద్ద ప్రమాదం జరిగినా చూసి చూడనట్టు పోతున్నారు. పోలీసు కేసులు, స్టేషన్ల చుట్టూ తిరగాలనే భయంతో పట్టించుకోకుండా వెళ్లిపోయేవారు ఎక్కువగా ఉంటున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రాణదాతలకు కేంద్ర ప్రభుత్వం "గుడ్ సమరిటన్ పథకం" ద్వారా భారీ నజరానాలు అందించేందుకు సిద్ధం అయింది.

ఈ పథకం కింద ప్రాణదాతలను ప్రోత్సహించేందుకు రూ.5 వేల నగదు, ప్రశంసాపత్రం ఇస్తుంది. ఏటా ఎక్కువ మందిని కాపాడిన 10 మందికి రూ.లక్ష అదనపు ప్రోత్సాహం అందజేస్తుంది. గంటలోపు క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తే ‘ప్రాణదాత’గా పేరు, వివరాలతో ఎక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తారు. పోలీసులు జిల్లా అప్రైజల్ కమిటీ (కలెక్టర్)కు పంపగా అక్కడి నుంచి రాష్ట్ర రవాణా కమిషనర్‌కు సిఫారసు చేస్తే రవాణాశాఖ ప్రాణదాతల ఖాతాలో రూ.5వేలు జమ చేసి ప్రశంసాపత్రం అందజేస్తుంది.

ఒక వ్యక్తికి ఏడాదికి గరిష్ఠంగా అయిదుసార్లు ఈ అవార్డు లభిస్తుంది. రోడ్డు ప్రమాద బాధితులకు స్వచ్ఛంద సహాయం చేసే వారిని వేధింపులు, నిర్బంధం నుంచి గుడ్ సమరిటన్ చట్టం రక్షిస్తుంది. వారు ఎలాంటి సివిల్, క్రిమినల్ బాధ్యత వహించరు. అలాగే క్షతగాత్రులను చేర్చిన వెంటనే ఆసుపత్రి నుంచి వెళ్లిపోవచ్చు. వ్యక్తిగత వివరాల ఐడీలు ఇవ్వనక్కర్లేదు.

చికిత్స ఖర్చులు కూడా భరించనవసరం లేదని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఇకపై ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఎందుకు రిస్క్ అనుకోకుండా క్షతగాత్రులను ఆసుపత్రికి చేర్చి, ప్రాణదాతలు అవ్వండి.

Next Story