2014 తర్వాత 12 మంది నేతలు జైలుపాలు.. కొత్త బిల్లుతో ఎవరి పదవులు పోయేవి?

by Phanindra |   (  Updated:2025-08-23 17:36:10  IST  )

2014 తర్వాత 12 మంది నేతలు పలు కేసుల్లో జైలుపాలయ్యారు. అమిత్ షా తెచ్చిన కొత్త బిల్లుతో ఎవరి పదవులు పోయేవో ఒకసారి చూద్దామా?

2014 తర్వాత 12 మంది నేతలు జైలుపాలు.. కొత్త బిల్లుతో ఎవరి పదవులు పోయేవి?
X

దిశ, నేషనల్ బ్యూరో: కఠినమైన శిక్షలు ఎదుర్కొనే అవకాశం ఉన్న కేసుల్లో అరెస్టయి.. జైల్లో కనీసం 30 రోజులు గడిపిన నేతలు ఆ మరుసటి రోజే తమ పదవులు కోల్పోయే బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవలే పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు.. అందర్నీ ఈ చట్ట పరిధిలో ఉంటారని అమిత్ షా చెప్పారు. ఇది ప్రతిపక్షాలపై బీజేపీ చేస్తున్న కుట్ర అని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పటికే సీబీఐ, ఈడీని ఆయుధాలుగా వాడుకుంటున్న బీజేపీ.. ఈ చట్టంతో కీలక నేతలను జైల్లో పెట్టించి, వారి పదవులు ఊడగొట్టేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

ఈ క్రమంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత ఎంతమంది నేతలు జైలుపాలయ్యారో చూస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం 12 మంది విపక్ష నేతలు జైలుపాలయ్యారు. వీరిలో ముగ్గురు నేతలు కొత్త చట్టంలో చెప్పినట్లు 30 రోజులు జైల్లో లేరు. కాబట్టి వీరి పదవులకు ఎలాంటి ప్రమాదం ఉండేది కాదు. అయితే మిగతా 9 మంది మాత్రం పదవులు కోల్పోయేవారు. ఈ అరెస్టయిన నేతల్లో ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, ఆప్ నేత జితేంద్ర ఎస్. తోమర్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 10 మందిని సీబీఐ, ఈడీలే అరెస్టు చేయడం గమనార్హం.

ఢిల్లీ లిక్కర్ స్కాం, పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్ ఫండ్, టీచర్ రిక్రూట్‌మెంట్ స్కాంలలో పలువురు నేతలు అరెస్టయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలో బీజేపీ, ఎన్డీయే కూటమికి చెందిన మంత్రులు ఎవరూ తీవ్రమైన నేరాల్లో అరెస్టవలేదు. పాత ఆర్మ్స్ యాక్ట్ కేసులో యూపీ మంత్రి రాకేష్ సచన్‌కు ఏడాది జైలు శిక్ష పడగా.. ఆయన అరెస్టవడానికి ముందే బెయిలుపై విడుదలయ్యారు. జయలలిత కూడా సుమారు 20 ఏళ్ల క్రితం నమోదైన అవినీతి కేసులోనే అరెస్టయ్యారు. అయితే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఆమె విడుదలయ్యారు. ఇక అవినీతి కేసులో అరెస్టవడానికి కొన్ని రోజుల ముందే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అరెస్టయిన నేతలు

జయలలిత- ఏఐఏడీఎంకే-అవినీతి కేసు-21 రోజులు జైల్లో ఉన్నారు

సుబ్రత ముఖర్జీ-టీఎంసీ-బ్రైబరీ కేసు-11 రోజులు

ఫిర్హాద్ హకీం-టీఎంసీ-బ్రైబరీ, అవినీతి-11 రోజులు

జ్యోతిప్రియ మాలిక్-టీఎంసీ-అవినీతి-80 రోజులు

మనీష్ సిసోడియా-ఆప్-అవినీతి-17 నెలలు

అరవింద్ కేజ్రీవాల్-ఆప్-అవినీతి-6 నెలలు

పార్థ ఛటర్జీ-టీఎంసీ-అవినీతి-3 సంవత్సరాల 27 రోజులు

సత్యేంద్ర జైన్-ఆప్-మనీలాండరింగ్-2 సంవత్సరాల 4 నెలలు

మదన్ మిత్ర-టీఎంసీ-చీటింగ్-21 నెలలు

వి. సెంథిల్ బాలాజీ-డీఎంకే-అవినీతి-15 నెలలు

జితేంద్ర తోమర్-ఆప్-ఫోర్జరీ-45 రోజులు

నవాబ్ మాలిక్-ఎన్సీపీ-మనీలాండరింగ్-17 నెలలు

Next Story