India-Pak: సింధు జలాల నిలుపుదలతో పాక్‌ ఆహర భద్రతకు ముప్పు

by S Gopi |

తలసరి నీటి లభ్యత గణనీయంగా క్షీణించడం ద్వారా ఇప్పటికే పాక్ ప్రపంచంలోనే తక్కువ నీటిని కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది.

India-Pak: సింధు జలాల నిలుపుదలతో పాక్‌ ఆహర భద్రతకు ముప్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లోని పెహల్‌గామ్‌లో సామాన్యులను బలిగొన్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. అందులో ప్రధానమైన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం. పెహల్‌గామ్ దాడికి ప్రతీకార చర్యల్లో భాగంగా కీలకమైన 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం నిలిపేస్తూ, ఉగ్రవాదానికి పాక్ మద్దతివ్వడం ఆపేవరకూ ఇది అమల్లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల పాక్ అన్ని రకాలుగా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి.

పాక్‌పై ప్రభావం

పాకిస్తాన్ సింధు నదీపై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఆ దేశ సాగు భూమిలో దాదాపు 80 శాతం అంటే 1.6 లక్షల హెక్టార్లు ఈ నదుల నీటిపైనే ఆధారపడ్డాయి. ఒడంబడిక (సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్) నియంత్రణలో ఉన్న నదులను నీటిపారుదల, పట్టణ వినియోగం, జలవిద్యుత్, నీటి సరఫరా కోసం వినియోగించవచ్చు. తలసరి నీటి లభ్యత గణనీయంగా క్షీణించడం ద్వారా ఇప్పటికే పాక్ ప్రపంచంలోనే తక్కువ నీటిని కలిగిన దేశాల్లో ఒకటిగా ఉంది. దేశంలో నీటి నిల్వ సామర్థ్యం దారుణంగా పడిపోయింది. సింధు నీటిలో 93 శాతం నీటిని పాక్ గోధుమ, వరి, చెరకు, పత్తి పంటలకు వాడుతోంది. ఇలాంటి సమయంలో భారత్ నిర్ణయం పాక్‌పై ఎక్కువ ప్రభావం చూపనుంది. పంట దిగుబడి, నీటి కొరత కారణంగా ఆహార భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు.

కరాచీ, లాహోర్, ముల్తాన్ వంటి ప్రధాన పట్టణాలు కూడా తాగునీటికి, పురపాలక అవసరాలకు సింధు జలాలపై ఆధారపడి ఉన్నాయి. సరఫరాలో ఏ మాత్రం కోత ఏర్పడినా ఆయా నగరాల్లో నీటి కొరతకు దారి తీస్తుంది, అది అశాంతికి కారణమవుతుంది.

అలాగే, టర్బెలా, మంగ్లా లాంటి ఆ దేశ కీలక జలవిద్యుత్ కేంద్రాలు ఈ నదుల ద్వారానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తాజా అంతరాయం వల్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోనుంది. పరిశ్రమలు, గృహాలకు కరెంట్ కొరత ఏర్పడవచ్చు.

మొత్తంగా సింధు జలాలు పాకిస్తాన్ జీడీపీలో దాదాపు 25 శాతానికి సహకారం అందిన్నాయి. భారత్ తీసుకున్న నిర్ణయంతో నిరుద్యోగం, గ్రామీణ వలసలు, అధిక లోన్ డిఫాల్ట్‌లకు దారితీయవచ్చు.

Next Story