- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటల్ టన్నెల్ వద్ద భయానక ప్రమాదం.. కారులోకి దూసుకెళ్లిన ఐరన్ రాడ్స్.. పర్యాటకుడు మృతి
హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అటల్ టన్నెల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన అటల్ టన్నెల్ (Atal Tunnel) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న ఓ కారు (మహీంద్రా స్కార్పియో) అదుపుతప్పి బారికేడ్లను ఢీకొట్టి, నిర్మాణంలో ఉన్న వంతెనపై పడిపోయింది. ఈ భయానక ఘటనలో రాజస్థాన్‌కు చెందిన ఓ పర్యాటకుడు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
పోలీసుల వివరాల ప్రకారం.. పర్యాటకుల బృందం మనాలి నుంచి లాహౌల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టన్నెల్ నుంచి బయటకు రాగానే కారు అతి వేగం కారణంగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న బారికేడ్లను బద్దలు కొట్టుకుని నేరుగా కింద నిర్మాణంలో ఉన్న వంతెనపైకి దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు వంతెన పిల్లర్ల కోసం ఏర్పాటు చేసిన ఇనుప చువ్వలు కారును చీల్చుకుంటూ లోపలికి చొచ్చుకుపోయాయి. దీంతో కారు నుజ్జునుజ్జయ్యింది.
సహాయక చర్యలు..
మృతుడిని రాజస్థాన్‌కు చెందిన కైలాష్ (34)గా గుర్తించారు. గాయపడిన మరో ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు ఇనుప చువ్వల్లో చిక్కుకుపోవడంతో తీవ్రంగా శ్రమించి క్షతగాత్రులను బయటకు తీశారు. వారిని సమీప ఆసుపత్రికి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు, కేసు దర్యాప్తు చేస్తున్నారు. అటల్ టన్నెల్ గుండా పర్యాటకుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో.. పర్వత ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు నిర్దేశిత వేగ పరిమితులను పాటించాలని, అప్రమత్తంగా డ్రైవింగ్ చేయాలని అధికారులు పర్యాటకులకు సూచిస్తున్నారు.






