ఇజ్రాయెల్, అమెరికా దాడుల వేళ.. ఇరాన్ కు హెజ్బొల్లా షాక్

by Naga Rani Yarlagadda |

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ (Israel), అమెరికా (America) వరుస దాడులతో పర్షియన్ గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఆ దేశానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

ఇజ్రాయెల్, అమెరికా దాడుల వేళ.. ఇరాన్ కు హెజ్బొల్లా షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ (Israel), అమెరికా (America) వరుస దాడులతో పర్షియన్ గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఆ దేశానికి మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లూ ఇరాన్‌కు నమ్మకమైన మిత్రుడిగా వ్యవహరించిన లెబనాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బొల్లా (Hezbollah) ఆశించిన మద్దతును ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఇటీవలి వరకు "ఇరాన్‌పై దాడి అయితే మేం సైతం ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు సిద్ధం" అని ప్రకటించిన హిజ్బొల్లా, తాజా పరిణామాల మధ్య మాట మార్చింది. తాజాగా ఆ సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. "ఇరాన్‌ తనను తానే రక్షించుకోగలదు. ఇజ్రాయెల్‌, అమెరికా కలిసికట్టుగా దాడి చేసినా.. ఇరాన్‌ సమర్థంగా స్పందించగలదు. హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్‌ మొదటగా దాడి చేయకపోతే మేము మొదలుపెట్టం" అని తెలిపారు.

గతేడాది నవంబర్‌లో హమాస్‌ (Hamas)కు మద్దతుగా హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు జరపగా, ప్రతిగా ఇజ్రాయెల్‌ ఆర్మీ హిజ్బొల్లా స్థావరాలపై విరుచుకుపడింది. భారీ నష్టం సంభవించడంతో, అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందానికి ఇప్పటికీ హిజ్బొల్లా కట్టుబడి ఉందని స్పష్టం చేసింది. ఇది టెహ్రాన్‌కు మానసికంగా పెద్ద దెబ్బగానే భావించబడుతోంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌పై ఉమ్మడి దాడికి హిజ్బొల్లా మద్దతు కీలకమని భావించిన ఇరాన్‌ కోసం ఇప్పుడు మిత్రుల మద్దతు సడలడం ఆందోళనకరం.

ఇరాన్‌పై అమెరికా తాజాగా చేసిన దాడుల్లో ఆ దేశ అణు స్థావరాలు, సైనిక గిడ్డంగులే లక్ష్యంగా దాడులు జరిపినట్లు పలు అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో హిజ్బొల్లా వెనక్కి తగ్గడం.. ప్రాంతీయ శాంతికి కొంత ఊరటనిచ్చినప్పటికీ, ఇరాన్‌కి మాత్రం ఒంటరిదైన పోరాటం ప్రారంభమైనట్లు సంకేతాలిచ్చింది.

Next Story