- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంటాడిన డెడ్‌లైన్ భయం.. ఏకంగా 25 మంది మావోయిస్టులు సరెండర్
ఛత్తీస్‌గఢ్ దంతెవాడలో 25 మంది మావోయిస్టులు ఒకేసారి లొంగిపోయారు. సెక్రటరీలు, ట్రెజరర్లు వంటి కీలక నేతలు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టు ఉద్యమానికి దాదాపు ఎండ్ కార్డు పడినట్లైంది. రాష్ట్ర ప్రభుత్వ ‘నియద్ నెల్లానార్’ (Niyad Nellanar) పథకం, పోలీసుల ‘లోన్ వర్రాటు’ (Lone Varratu) ప్రచారంతో ప్రభావితమై, వివిధ మావోయిస్టు దళాలకు చెందిన మొత్తం 25 మంది కీలక సభ్యులు ఈ రోజు గంగులూరు పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ (SP Gaurav Rai), సీఆర్పీఎఫ్ (CRPF) అధికారుల సమక్షంలో ఈ లొంగుబాటు జరిగింది.
లొంగిపోయిన వారిలో గంగులూరు ఏరియా కమిటీ, కిష్టారం ఏరియా కమిటీ, భైరమ్‌గఢ్ ఏరియా కమిటీలకు చెందిన ముఖ్యమైన సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శులు, ఒకరు సంయుక్త కార్యదర్శి, నలుగురు ట్రెజరర్లు, ఆరుగురు కార్యవర్గ సభ్యులు, 12 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. అందులో కొందరిపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులు ప్రకటించింది. పీఎల్‌జీఏ కీలక సభ్యుడు మోతిరామ్ ఒయామ్ (Motiram Oyam), కేఏఎంఎస్ అధ్యక్షురాలు సుక్మతి ఒయామ్ (Sukmati Oyam), మిలీషియా కమాండర్ మడ్వి భీమా (Madvi Bhima) లొంగిపోయిన వారి జాబితాలో ఉన్నారు.
మావోయిస్టు అగ్ర నాయకత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతులు, స్థానిక గిరిజనులపై జరుగుతున్న వేధింపులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై తాము జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించారు. వీరి లొంగుబాటును జిల్లా ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు ధృవీకరించారు. సరెండర్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయంగా రూ.25,000 నగదు, పునరావాస ప్యాకేజీని అందజేశారు. తుపాకీ పట్టిన యువత హింసను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సదువియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. ఈ లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.






