- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్‌లాండ్ మాకివ్వాల్సిందే.. లేదంటే ఊరుకోను: ట్రంప్
గ్రీన్‌లాండ్ తమకివ్వాల్సిందేనని, లేదంటే తాను ఊరుకోనని ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చాడు.

దిశ, నేషనల్ బ్యూరో: గ్రీన్‌ల్యాండ్‌పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ తమకు తప్పనిసరి అని చెప్పిన ఆయన.. తను నిర్మించాలని అనుకుంటున్న ‘గోల్డెన్ డోమ్’ రక్షణ వ్యవస్థకు గ్రీన్‌లాండ్ తప్పనిసరి అని తేల్చిచెప్పారు. యూఎస్ చేతికి గ్రీన్‌లాండ్ దక్కితే నాటో మరింత శక్తిమంతంగా మారుతుందని, అలా కాకపోతే తాను ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో కొన్నిరోజుల నుంచి డెన్మార్క్, యూఎస్, గ్రీన్‌లాండ్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘గోల్డెన్ డోమ్’ నిర్మాణాన్ని నాటో ముందుండి నడిపించాలని, లేదంటే రష్యా లేదా చైనా ఈ పని చేసేస్తాయని, అది తాను జరగనివ్వబోనని ట్రంప్ తన సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. తాము డెన్మార్క్‌తోనే ఉంటామన్న గ్రీన్‌లాండ్ ప్రధాని మాటలను కూడా ట్రంప్ ఖండించారు. అలా అనడం పెద్ద సమస్యగా మారుతుందన్న ఆయన.. ‘అది వాళ్ల సమస్య. నేను వారి అభిప్రాయంతో ఏకీభవించను. అసలు అతనెవరో నాకు తెలీదు. కానీ ఈ మాటలు మాత్రం అతనికి పెద్ద సమస్యగా మారతాయి’ అని వార్నింగ్ ఇచ్చారు.
మేం డెన్మార్క్ వెంటే..
యూఎస్ హెచ్చరికల నేపథ్యంలో గ్రీన్‌లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నీల్సన్ స్పందించారు. తాము డెన్మార్క్‌తోనే ఉండాలని అనుకుంటున్నామని ప్రకటించారు. ‘మేం ప్రస్తుతం అంతర్జాతీయ సంక్షోభం ఎదుర్కొంటున్నాం. యూఎస్ లేదా డెన్మార్క్ మధ్య సెలెక్ట్ చేసుకోవాలంటే.. మేం డెన్మార్క్‌తోనే ఉంటాం. ఇప్పుడు కింగ్డమ్ ఆఫ్ డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌లాండే మాకు కావాలి’ అని నీల్సన్ చెప్పారు. డెన్మార్క్ పీఎం మెట్టే ఫ్రెడరిక్సన్‌తో కలిసి కోపెన్‌హాగన్ వేదికగా నిర్వహించిన మీడియా సమావేశంలో పీఎం నీల్సన్ తన అభిప్రాయాన్ని స్పష్టంచేశారు. ఈ విషయంపై యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కలిసి చర్చలు జరపడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ చేస్తున్న హెచ్చరికలు సబబు కాదని, పరిస్థితి తీవ్రంగా ఉందని ఆందోళన వ్యక్తంచేశారు.
మిలిటరీ పెంచుతాం: డెన్మార్క్ కౌంటర్
వ్యూహాత్మకంగా కీలకమైన గ్రీన్‌లాండ్ భద్రతను డెన్మార్క్ ఇంతకాలం నిర్లక్ష్యం చేసిందని యూఎస్ విమర్శలు చేసింది. వీటికి బదులిచ్చిన డానిష్ రక్షణ మంత్రి ట్రోల్స్ లుండ్ పోల్సెన్.. అవసరమైతే గ్రీన్‌లాండ్‌లో నాటో దళాలను పెంచుతామని, ఆర్కిటిక్ సముద్రంలో కూడా నాటో నిఘా పెడతామని చెప్పారు. గ్రీన్‌లాండ్‌లో తమ సొంత మిలిటరీని కూడా పెంచుతామని స్పష్టంచేశారు. ఈ ఏడాదిలో గ్రీన్‌లాండ్‌లో చేపట్టే నూతన కార్యకలాపాల గురించి మిత్రదేశాలతో డెన్మార్క్ చర్చలు జరుపుతోందని ఆయన తెలిపారు. ఆర్కిటిక్‌లో మంచు కరగడంతో ఇప్పుడు ఆ ప్రాంతం జలరవాణాకు అనుకూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు అంతగా ప్రాధాన్యం లేని గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నసంగతి తెలిసిందే.






